రూ.40 కోట్ల అప్పులో కామారెడ్డి మున్సిపాలిటీ

by Sridhar Babu |
రూ.40 కోట్ల అప్పులో కామారెడ్డి మున్సిపాలిటీ
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ రూ. 40 కోట్ల అప్పులో ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం 11 కోట్లు అయితే ఖర్చు 15 కోట్లు ఉందని, ప్రస్తుతం వివిధ రకాల అప్పు 40 కోట్లు ఉందన్నారు. గత నెల 23 న కళాభారతిలో బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించగా సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చించారు. గతంలో జరిగిన పనులు, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలు, చెల్లించాల్సిన బకాయిలపై చర్చించారు.

భవిష్యత్తులో కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని, పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. మున్సిపల్ సమావేశం ఎజెండా అంశాలు తమతో చర్చించకుండా మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తయారు చేశారని, సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ కు అందించారు. దీంతో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే కేవీఆర్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి అభివృద్ధికి మొట్ట మొదటిసారిగా పార్టీలకు అతీతంగా 49 మంది కౌన్సిలర్లు కృషి చేస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 17 కోట్లు కరెంట్ బిల్లులు, 4.5 కోట్లు శానిటేషన్ పీఎఫ్,

10 కోట్లు పనులకు చెల్లించాల్సిన బకాయి, 25 కోట్ల వరకు ఎస్డీఎఫ్ నుంచి ఇవ్వాల్సి ఉందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి ఆదాయ మార్గాల కన్నా ఖర్చులు అధికంగా ఉన్నట్టు తెలిపారు. మున్సిపాలిటీలో సుమారు 2 నుంచి 3 వేల ఇళ్ల వరకు కమర్షియల్ టాక్స్ చెల్లించడం లేదన్నారు. మున్సిపాలిటీకి చెందిన 40 కోట్ల అప్పు తీరాలని, 4 కోట్ల భారం తగ్గాలని, కామారెడ్డి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇది జరగాలంటే ఏడాదికి 40 కోట్లు మున్సిపాలిటీకి ఆదాయాన్ని సృష్టించాలన్నారు. ప్రస్తుతం 11 కోట్లు మాత్రమే ఉందని, ఇలాగే కొనసాగితే వీధి దీపాలు, తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అంటే మున్సిపాలిటీలో ఏ మేరకు అవినీతి జరుగుతుందో అర్థం అవుతుందన్నారు. ఇంకోసారి ఇలాంటి అవినీతి జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

కామారెడ్డి నియోజకవర్గానికి సంపాదించుకోవడానికి వచ్చిన అధికారులు ఉంటే వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే వారి డబ్బుల గురించి ఆశలు వదులుకుని నిజాయితీగా పని చేయాలన్నారు. ఇప్పటికే కామారెడ్డి మున్సిపాలిటీలో గతంలో అవినీతికి పాల్పడిన అధికారులు విజిలెన్స్ తనిఖీల ద్వారా ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని, మిగతా ఉద్యోగులు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని కులసంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య వర్గాలు, విశ్రాంత ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కమిటీ వేయాలన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 12 పార్లమెంట్

నియోజకవర్గాల్లో దాదాపు 84 మున్సిపాలిటీలు తిరిగానని, అన్ని మున్సిపాలిటీలు బాగున్నాయని, కామారెడ్డి మాత్రం 3వ స్థానం కంటే తక్కువలో వరస్ట్ మున్సిపాలిటీగా ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 500 ఓపెన్ స్థలాలు ఉంటే అందులో 300 వరకు కుల సంఘాలకు ఇచ్చారని, ఇలా అయితే అర్బన్ పార్కులు, ఇతర అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మార్పు రావాలని, దానికోసం కమర్షియల్ ట్యాక్స్ విషయంలో రీ సెట్ చేయడానికి కౌన్సిలర్లందరూ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. ఏడాదిలో 40 కోట్ల ఆదాయం వచ్చేలా చేయవచ్చని, దానికోసం ప్రజలు సహకరించాలని కోరారు. అవినీతి లేని కామారెడ్డి మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed