బీఆర్ఎస్ కు సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎం లాంటివి

by Sridhar Babu |
బీఆర్ఎస్ కు సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎం లాంటివి
X

దిశ, కామారెడ్డి : నీటి పారుదల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారాయని, వారికి డబ్బులు అవసరం అయినప్పుడల్లా ప్రాజెక్టులు డిజైన్ చేస్తారని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ... తాను తెలంగాణ వచ్చినప్పుడల్లా ప్రజల కళ్లలో ఆశలు కనిపిస్తాయన్నారు. 9 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్, 7 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పేదలు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదన్నారు. సకల జనుల సౌజన్యమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని తెలిపారు. బీజేపీ చెప్పింది చేసి చూపించిందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, రైతులకు గిట్టుబాటు ధర, రామమందిర నిర్మాణం, పసుపు బోర్డు ఏర్పాటు, ఆదివాసీలకు సెంట్రల్ యూనివర్సిటీ హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు.

మోడీ గ్యారెంటీ ఇస్తే చేసి చూపిస్తామన్నారు. బీసీలకు బీజేపీ పూర్తిగా అండగా ఉందన్నారు. రికార్డు స్థాయిలో కేంద్రంలో బీసీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిందని, బీసీ ప్రధానిని చేసింది బీజేపీ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీలు, దళితులను విస్మరించాయన్నారు. దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ దళితుల ఓట్లు రాగానే తానే సీఎం కుర్చీలో కూర్చున్నాడని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని, మాదిగల సాధికారత కోసం కమిటీ వేశామని గుర్తు చేశారు. దీని ద్వారా న్యాయ సమీక్ష చేస్తున్నామని, కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టులో కొనసాగుతుందన్నారు. తెలంగాణ రైతులు కష్టార్జితానికి పెట్టింది పేరని, అలాంటి రైతులను ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. కిసాన్ ప్రధాన మంత్రి సమ్మాన్ యోజన నిధి ద్వారా 2.75 లక్షల కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేశామని, ఇందులో రాష్ట్రంలోని 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగితే కామారెడ్డి జిల్లాలో 1.50 లక్షల మంది రైతులు 400 కోట్ల లబ్ది పొందారన్నారు.

ఇతర దేశాల్లో 2,3 వేలకు యూరియా ఇస్తే మన దేశంలో కేవలం 300 రూపాయలకే యూరియా ఇచ్చి రైతులను ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం1.30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రమే బాయిల్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పి రైతుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ కొనుగోలు చేసిందన్నారు. రైతులకు అదనపు ఆదాయం కోసం కేంద్రం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా బయో గ్యాస్ తయారీ చేస్తుందని, పెట్రోల్, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గోవర్ధన యోజన పేరుతో 15 వేల కోట్లతో పశువులకు వ్యాక్సిన్ అందజేస్తుందన్నారు. తెలంగాణ యువకుల రాష్ట్రమని, ఇక్కడ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలపై యువత ఆశలు పెంచుకుంటే ప్రభుత్వం లీకుల పేరుతో దగా చేసిందని విమర్శించారు. విద్యా వ్యవస్థను ఆగం చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వారి బిడ్డల భవిష్యత్ కోసం ఆలోచిస్తే బీజేపీ మాత్రం ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరూ ఇతర చోట్ల ఓడిపోతున్నామని తెలిసి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని, కామారెడ్డి ప్రజలను చూసి వారికి భయం పట్టుకుంటుందన్నారు. బంధుప్రీతి రాజకీయాలను కామారెడ్డి ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇండి అలియన్స్ కూటమి ఏర్పడినంత మాత్రాన వారి బుద్ది మారలేదని విమర్శించారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ను గద్దె దించారని, డిసెంబర్ 3 న కేసీఆర్ ను గద్దె దించుతారన్న నమ్మకం ప్రజలపై ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నాయోజన కింద ఉచిత బియ్యం అందిస్తుందని, దీనిని మరొక ఐదేళ్ల పాటు పొడిగించామన్నారు. బీజేపీకి ప్రస్తుతం 300 మంది ఎంపీలు ఉన్నారని, ఇద్దరు ఎంపీలు ఉన్న బలహీన సమయంలో తెలుగు ప్రజలు తమకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, అరుణతార, ఎండల లక్ష్మీనారాయణ, సంగప్ప తదితర అభ్యర్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed