ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారత్

by Sridhar Babu |
ప్రజాస్వామ్య గణతంత్ర  రాజ్యంగా భారత్
X

దిశ, కామారెడ్డి : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించిన తరువాత భారత దేశ పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగిందన్నారు. కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు 1947 ఆగస్టు 28న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతి పెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు. జనవరి 26 ను సంపూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చి, ఆ తేదీ ప్రాముఖ్యత దృష్ట్యా బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935ను రద్దు చేస్తూ 26 జనవరి 1950 నుండి నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చుకున్నామన్నారు.

నాటి నుండి భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో హక్కుగా పొందారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాల ప్రగతిని ప్రస్తావిస్తూ...అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు హామీ ఇచ్చి, రెండు గ్యారంటీలను ఇప్పటికే నెరవేర్చిందని అన్నారు. అందులో మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 27 లక్షల 75 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆందుబాటులో ఉంటూ పారదర్శకమైనపాలన అందించుటకు గత జనవరి 28 నుండి ఫిబ్రవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం కింద జిల్లాలో ని 526 గ్రామ పంచాయతీలు,

80 మునిసిపల్ వార్డుల్లో 6 గ్యారంటీల కోసం 2,94,799 ధరఖాస్తులతో పాటు ఇతర సమస్యల గురించి 13,367 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రైతన్నలకు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ తో పాటు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని అన్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నదని, పద్ధతి ప్రకారం ప్రక్రియ పూర్తి చేయుటకు ప్రభుత్వం

కృతనిశ్చయంతో ఉన్నదని పేర్కొన్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ప్రజలు కూడా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటలో చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులకు, ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, జెడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed