కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా..జీవన్ రెడ్డి

by Sumithra |
కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా..జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి నేను మీ కోసమే పని చేసే మీ జీవన్ రెడ్డిని అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అర్ధించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం "నమస్తే చేపూర్... మీ కోసం మీ జీవన్ రెడ్డిని" అనే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపూర్ గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళ తాళాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. పూలమాలలు, శాలువాలతో ప్రజా ప్రతినిధులు, వీడీసీ, కుల సంఘాల సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో "జై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్, జై జీవనన్న" అన్న నినాదాలతో మారు మోగించారు.

కాగా జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు. "నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని. నేను మీ బిడ్డను. నా జీవితం ప్రజాసేవకే అంకితం. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్నా. ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీలా సువర్ణాక్షరాలతో లిఖిస్తా అని జీవన్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గం గతంలో ఎట్లుంది?. ఇప్పుడెట్లుంది? అభివృద్ధి జరగని పల్లె ఉందా? సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా? సీఎం కేసీఆర్ ప్రజల పాలిట దేవుడన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని చేపూర్ చౌరస్తాలో నిలబడి కూతలు కూసిన సన్నాసులకు చేపూర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ధీటైన సమాధానం అన్నారు.

చేపూర్ గ్రామమంటే నాకు సెంటిమెంట్ అని, ఎనిమిదేళ్లుగా జరుగుతున్నఅభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి అన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి చూసారా? ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి చెప్పడానికే నేనొచ్చా నని జీవన్ రెడ్డి చెప్పారు. చేపూర్ గ్రామంలో ప్రజలందరికీ అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పథకాల వారీగా, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంఘాల వారీగా జీవన్ రెడ్డి వివరించారు.

బీజేపీ, కాంగ్రెస్ లకు ఎప్పుడూ ఓట్లు, నోట్ల గొడవే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రజలంటే చులకన భావం ఉందన్నారు. బీఆర్ఎస్ లా ప్రజల కోసమే పనిచేసే మంచి బుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు కొరవడిందన్నారు. అవి ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే బలహీన వర్గాలు , రైతుల సంక్షేమన్నారు. కేసీఆర్ జమానా అభివృద్ధికి నమూనా అని, సబ్బండ వర్గాలన్నీ సారు, కారు, కేసీఆర్, బీఆర్ఎస్ వైపే చూస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలో పడొద్దన్నారు. కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా? ఎంపీ అరవింద్ ఒక నయవంచకుడు అన్నారు. ఒకే కొంపలో మూడు కుంపట్లు, మూడు పార్టీలు, సొంతింటినే రచ్చకీడ్చుకున్న ఈ ప్రబుద్దులా ప్రజలకు మేలు చేసేదా అన్నారు.

బీజేపీ ఒక విషవలయం అని, కాంగ్రెస్ అవినీతికి నిలయం అన్నారు. ఏ కాంగ్రెస్ వాడో, బీజేపీ వాడో మనకొద్దు అన్నారు. బీఆర్ఎస్, జీవన్ రెడ్డే మీకు ముద్దు. మళ్లీ మళ్లీ విజయం బీఆర్ఎస్ దేనని , ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జీవన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ టిసి. సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు రిక్కలా రాజురెడ్డి , మాజీ ఎంపీటీసీ జన్నేపల్లి గంగాధర్, బీఆర్ ఎస్వీ నాయకులు షాహిద్ , గంగాధర్ , నాగరాజు బీఆర్ఎస్ నాయకులు సిందుకర్ చరణ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed