గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

by Naveena |
గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మిని సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులతో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే పరీక్షలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కామారెడ్డి పట్టణంలో 20 కేంద్రాలలో 8268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతీ కేంద్రంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల్లో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. కేంద్రానికి ప్రహారీ గోడ లేనట్లయితే అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటుతో పాటు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించే ముందు వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపించాలని, మగ, ఆడ అభ్యర్థులను విడివిడిగా వెరిఫై చేయాలన్నారు.

ప్రతీ కేంద్రంలో సి.సి.కెమెరాలు, ఫర్నిచర్, త్రాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ టీమ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పరీక్షకు నాలుగు రూట్లలో జాయింట్ రూట్ అధికారులతో విజిట్ చేయాలని తెలిపారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్లను నియమించుకోవాలని తెలిపారు. ఈ నెల 14 న శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సమయానుకూలంగా పరీక్షకు ముందు, పరీక్ష అనంతరం ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ సెంటర్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు.. ఏ.ఎన్.ఏం. లను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అభ్యర్థులు టీజీపీఎస్ పోర్టల్ నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.

అలాగే కేంద్రాల్లో ఎలాంటి పోస్టర్లు, హార్డింగ్స్, ప్రచార సామాగ్రి లను తొలగించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను పరీక్షల నిర్వహణ సమయంలో మూసివేయించాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్ష హాలులోకి సెల్ ఫోన్ అనుమతించబోమని, కేవలం చీఫ్ సూపరింటెండెంట్ లకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులను పరీక్ష కేంద్రల్లోకి అనుమతించకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఆర గంట ముందే హాజరు కావాలని, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెస్ లను, ఎలాంటివి పరీక్ష హాలులోకి అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలను సాఫీగా ఎలాంటి మాల్ ప్రాక్టీసు కు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్, అదనపు ఎస్పీ కే.నరసింహ రెడ్డి, డిఎస్పీ నాగేశ్వర్ రావు, రీజనల్ కో ఆర్డినేటర్ కే.విజయకుమార్, ఇన్చార్జి మున్సిపల్ కమీషనర్ వేణు గోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ చందర్, డీ ఈ వో రాజు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed