పురాణ కాలం నుంచే స్త్రీకి ఉన్నత స్థానం

by Sridhar Babu |
పురాణ కాలం నుంచే స్త్రీకి ఉన్నత స్థానం
X

దిశ, కామారెడ్డి : స్త్రీ ఆదిశక్తి అని, పురాణ కాలం నుంచే స్త్రీకి ఉన్నతస్థానం ఇచ్చి గౌరవించారని జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా పాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహకారంతో జిల్లా కోర్టు సముదాయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, మహిళలు, ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం, మహిళా సాధికారతను సాధిద్దాం అనే ప్ల కార్డులు, నినాదాలతో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగింది. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రేదేవి మాట్లాడుతూ..

ఒక మహిళ తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఎంతో సేవ చేస్తుందని, అట్టి మానవతా మూర్తికి అవకాశాలు ఇస్తే అంతరిక్షానికైనా వెళ్తారని, వారిని ముందుకు నడిపించుటలో పురుషులు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. మహిళలు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని, నమ్మకంగా పనిచేసే గుణం వారిలో ఉందని, వంటింటికే పరిమితం కాకుండా వివిధ రంగాలలో రాణిస్తే దేశం పురోగమిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ మహిళలు ఇంటా, బయట అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తుండడం అభినందనీయం అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని, జిల్లా యంత్రాగం కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని, దైనందిక జీవితంలో మంచి విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ... మహిళలకు ప్రత్యేకించి ఒక రోజు కేటాయించి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో, సాంస్కృతిక రంగాల్లో జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరచిన మహిళా క్రీడాకారులను సన్మానించు కుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురిని శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఉదయం కోర్టు సముదాయంలో ఆరోగ్య

మహిళా, ఆరోగ్య కుటుంబం, ఆరోగ్యమైన సమాజం అంశంపై విద్య, వైద్యం, పోలీసు, జర్నలిజం, వృద్ధాశ్రమం, తదితర ఉన్నత రంగాల నుండి మహిళలు సమావేశమై మహిళా సాధికారతపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి, ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ సతీమణి శ్రద్ధ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. ఈ కారక్రమంలో ట్రైనీ ఎస్పీ కాజల్ సింగ్, డీఎఫ్ఓ నిఖిత, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed