అధికార బీఆర్ఎస్ పార్టితో కాంగ్రెస్ నేతలు పగలు పైట్.. రాత్రి దోస్తానా

by Sumithra |
అధికార బీఆర్ఎస్ పార్టితో కాంగ్రెస్ నేతలు పగలు పైట్.. రాత్రి దోస్తానా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తీవ్రంగానే కసరత్తు జరుగుతుంది. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈసారి ఎలాగైనా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని భావిస్తుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక టీంలతో సర్వేను చేయించినట్లు సమాచారం. సర్వేల ఆధారంగానే ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ముద్ర పడిన వారు వ్యవహర శైలి పార్టీకి తలనొప్పిగా మారుతుంది.

ప్రధానంగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులతో ప్రధానంగా ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ నాయకులు టచ్ లో ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు అటుంచి ఎమ్మెల్యేలు చెప్పినట్లే ప్రతిపక్ష లీడర్లు నడుచుకుంటున్నారని విమర్శలను మూటగట్టుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపునిచ్చినప్పుడు మాత్రమే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని మిగిలిన సమయంలో వారితో దోస్తానా చేస్తున్నారన్న అపవాదు ఉంది. అధికార పార్టీ నాయకుల కంటే ప్రతిపక్ష లీడర్ల మాటలనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారనే వాదనలు ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు చేస్తున్న ఇన్ లీగల్ దందాలు కానీ, దౌర్జన్యాలపై ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతెత్తకపోవడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పని చేస్తూ కర్ణాటకలో విజయధుందుబిని సొమ్ము చేసుకుంటూ అధికారంలోకి రావడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లుగా షబ్బీర్ ఆలీ, సుదర్శన్ రెడ్డి, సౌదాగార్ గంగారాం, మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, మధుయాష్కీ గౌడ్ లు అహర్నిశలు కష్టపడుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో పాటు కామారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో బోటాబోటి ఓట్ల మెజార్టీతో ఓటమి చెందిన విషయం తెల్సిందే. గడిచిన ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండేది.

అదే మాదిరిగా కాంగ్రెస్ క్యాడర్ కు ఉమ్మడి జిల్లాలో ఢోకా లేదు. గాంధీ ఫ్యామిలీ వెంట నడిచిన క్యాడర్ ఈనాటికి కూడా సానుభూతిపరులుగానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పేరుకు సీనియర్లు ఉన్నా మధ్యస్తంగా ఉన్న లీడర్లదే పెత్తనం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. సీనియర్లుగా గతంలో ప్రజాప్రతినిధులుగా చేసిన వారి కంటే ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాని వారు ఈసారి కచ్చితంగా బరిలో ఉండాలని కసరత్తు చేస్తున్నారు. వారికి ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా ఎన్నికల గోదాలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నజర్ లో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.

ఉమ్మడి జిల్లాలో కొందరు లీడర్లు ప్రధానంగా ఎన్నికల్లో నిలుచుందామని కసరత్తు చేస్తున్న వారి వివరాలను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి చేరినట్లు సమాచారం. అందులో కొందరు ఎలక్షన్ బరిలో క్యాండెట్టమని చెప్పుకుని తిరుగుతునే అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో నిల్చుండడం ద్వారా పార్టీని వీక్ చేసి అధికార పక్షాన్ని గెలుపు వాకిట నిలుపడమే లక్ష్యమన్న వాదనలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గత నాలుగు సంవత్సరాల్లో గ్రూపు రాజకీయాలతో పాటు అగ్రనాయకత్వం వచ్చినప్పుడు వ్యవహరించిన తీరే ఉదాహరణగా చెబుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలతో పాటు హాత్ సే హాత్ జోడో, గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జరిగిన నిరసనలు అంతగా ప్రభావం చూపకపోవడానికి లీడర్లు, బీఆర్ఎస్ నాయకులతో అవగాహననే కారణమన్న విమర్శలను మూటగట్టుకుంది.

ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల లీడర్లు ఈసారి టికెట్ ను తెచ్చుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోరుకుంటున్నారని సమాచారం. తమ గెలుపునకు వారైతేనే సులువుగా ఉంటుందని వారిని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. గతంలో పోటీ చేసిన ఈసారి టికెట్లు ఆశిస్తున్న కొందరి వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందనేది వాదనలు పెరిగాయి. వారు తమ స్వార్థం కోసం పార్టీని అధికార పార్టీ ముంగిట బేరసారాలకు దిగారని అందుకే రేవంత్ రెడ్డి క్యాండెట్ల ఎంపికను గెలుపు గుర్రాలపై ద`ష్టి పెట్టడం అందులో భాగమే అని చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కొందరకి మీకే టికెట్లు అని రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంతో వారు పార్టీకి ప్రమేయం లేకుండాన తమ సొంత బలగంతో, ఆర్థిక వనరులతో ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఎవరనే గుర్తించే పనులు చేస్తునే ఈసారి ఖచ్చితంగా గెలువాలన్న ప్రణాళికతోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పని చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed