ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలి

by Sridhar Babu |
ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలి
X

దిశ, లింగంపేట్ : వరి పంట సాగు చేస్తున్న ప్రతి రైతు భూసార పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి సూచించారు. మండలంలోని వర్మల గ్రామంలో గల రైతు వేదికలో బుధవారం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు ఖచ్చితంగా పండించే నేలలోని మట్టిని పరీక్ష చేసి దానిలో ఉన్న పోషకాల విలువను తెలుసుకోవాలని సూచించారు. దీని వలన పంటకు మనం అందించే ఎరువులను తగిన మోతాదుల్లో అందించవచ్చన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగులు సాధించవచ్చని అన్నారు. అదేవిధంగా మట్టి పరీక్షకు సంబంధించి మట్టిని ఏ విధంగా సేకరించాలో కూడా రైతులకు అవగాహన కల్పించారు.

అనంతరం ఎల్లారెడ్డి ఏడీఐ రత్న మాట్లాడుతూ రైతులు అధికంగా యూరియా వినియోగించడం వల్ల వరి పంటకు తెగుళ్లు సోకుతున్నట్లు, మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల అధిక పెట్టుబడులతో పాటు దిగుబడును తగ్గిపోతున్నాయని ఆమె వివరించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు ఎరువులను వినియోగించాలని అన్నారు. ఎన్జీవో సభ్యుడైన రత్నాకర్ మాట్లాడుతూ మట్టి పరీక్ష వలన కలిగే ఉపయోగాలు, రైతులకు ఈ మట్టి పరీక్ష చేసే లాభం గురించి వివరించారు. అదేవిధంగా రైతులందరికీ మట్టి పరీక్ష ఏ విధంగా చేయాలో వారు ప్రత్యక్షంగా చేసి చూపించారు. తర్వాత 20 మంది రైతులకు సేవా స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ మట్టి పరీక్ష చేసే కిట్లను అందజేశారు.

ఈ కార్యక్రమం వలన రైతులు ఎంతగానో సంతోష పడినట్లు రైతు మాలోత్ సక్రు తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుండి అందించిన కిట్ల ద్వారా తమ నేలలో ఉన్న పోషక లోపాలను త్వరితగతిన గుర్తించి పంటలకు తగిన మోతాదులో ఎరువు అందించడం జరుగుతుంది అని, ఒకప్పుడు మట్టి పరీక్షకు చాలా రోజులు పట్టేవని ఈ కిట్ల ద్వారా కేవలం 10 నుండి 15 నిమిషాలలో రిజల్ట్ రావడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నం, భారతి, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్, ఎన్జీవో సభ్యుడు రత్నాకర్, రైతులు మాలోత్ విట్టల్, సక్రు, చందర్, నవీన్, కాట్రోత్ సవైసింగ్, కిషన్, మోహన్, దేవి సింగ్, నెనావత్ రమేష్, రమావత్ సర్దార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed