ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి అయినా పనులు చేసి పెడతా

by Sridhar Babu |
ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి అయినా  పనులు చేసి పెడతా
X

దిశ, బాన్సువాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కి అయినా సరే బాన్సువాడ నియోజకవర్గం లోని రైతులు, ప్రజలకు పనులు చేసి పెడతానని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో బీర్కూర్ మండలంలోని ఆయా సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడలో తాను ఓటమి చెందినందుకు తనకు బాధగా లేదని, తాను ఇక్కడే ఉంటానని చెబితే నన్ను నమ్ముకుని ఓటేసిన ప్రజలు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. తాను ఓడిపోతే ఇక్కడ ఉందనని, ఎల్లారెడ్డికి వెళ్లిపోతానని అబద్దాలు చెప్పి, ఎన్నికల్లో గెలిచారని, తాను ఇక్కడే ఉండేందుకు స్థలం కొని, ఇల్లు కడుతున్నానని తెలిసి పోచారం కుటుంబం పరేషాన్ అవుతోందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి,

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వీటిని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగం ఆగం అవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజులలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పి మాట నిలబెట్టుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ఓపికలేకుండా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకులను బండకేసి కొట్టినా సిగ్గు రావడం లేదన్నారు. ఎమ్మెల్యే పోచారం తన స్వగ్రామంలో కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి రెండు, మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఖచ్చితంగా పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. పోచారం బీర్కూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని, పక్కాగా ఇసుక దందా చేశాడని దుయ్యబట్టారు. బీర్కూర్ డబుల్ రోడ్డు ఎన్నికల ముందు ప్రారంభించి,

ఇప్పటికి పూర్తి చేయడం లేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి 26/4 డిస్ట్రిబ్యూటరీ కాలువ కోసం 2 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఆ ఫైల్ ను నువ్వు తొక్కిపెట్టలేదా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఆ ఫైల్ ను తాను జిల్లా మంత్రి ద్వారా తీయించి బీర్కూర్ మండలంలోని నాలుగు చెరువుకు నీరందేవిధంగా చేసి రైతులకు న్యాయం చేస్తానన్నారు. పోచారం నాపై విమర్శలు చేయడం కాదు, ముందు నీ కొడుకులకు సంస్కారం నేర్పుకో అని హితవు పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి బీర్కూర్ మండల కేంద్రం నుండి సుమారు 250 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీర్కూర్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, జెడ్పీటీసీ స్వరూప, పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, పాత బాలకృష్ణ, విజయ్ ప్రకాష్, శ్రీనివాస్, రాచప్ప పటేల్, కాంత్ రెడ్డి, కమ్మ సత్యనారాయణ, మేకల సురేష్, కిషోర్ యాదవ్, యలమంచిలి శ్రీనివాస్ రావు, ప్రతాప్ సింగ్, యామ రాములు, సానేపు గంగారాం, చంద్ర శేఖర్, గణేష్, కమలాకర్ రెడ్డి, ఎక్బల్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed