Collector : పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ పనులను వెంటనే పూర్తి చేయాలి

by Kalyani |
Collector : పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
X

దిశ, గోదావరిఖని : రామగుండం నగరం లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పెండింగ్ ఉన్న చివరి పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండంలోని 3వ డివిజన్ జంగాలపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పరిశీలించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం నగరంలో మొత్తం 670 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టగా, 570 ఇళ్లు పూర్తి చేసి పెయింటింగ్ జరుగుతుందని, 56 ఇండ్లు ప్లాస్టింగ్ దశలో ఉన్నాయని, 34 ఇండ్లలో ఇటుకల నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని, పనుల వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని అన్నారు.

పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. అనంతరం రామగుండంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్య నిర్వహణ పై రివ్యూ నిర్వహించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మంజూరు చేసిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్దరణ కింద మంజూరు చేసిన పనులను వివిధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story