SC Classification : ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు ఇదే

by Ramesh N |   ( Updated:2024-10-08 15:32:50.0  )
SC Classification : ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకావ్యక్తి కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు హజరయ్యారు. ఏకావ్యక్తి కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఉపసంఘం తీర్మానించింది.

అంతే కాకుండా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నాలుగో సారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది.

జిల్లాల వారీగా పర్యటన

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైమ్‌బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన బీసీల సాంఘిక ఆర్థిక గణన చేపట్టాలని సూచించారు.అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలన్నారు.

Advertisement

Next Story

Most Viewed