మాజీ ఎమ్మెల్యే కార్యాలయాల్లో సామగ్రి ధ్వంసం

by Sridhar Babu |
మాజీ ఎమ్మెల్యే కార్యాలయాల్లో సామగ్రి ధ్వంసం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు నీచ రాజకీయాలకు కేంద్రాలుగా మారాయి. ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలతో నిర్మించిన ఎమ్మెల్యేల అధికారిక నివాసాలను వదలడానికి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మనసొప్పడం లేదు. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అవే పార్టీ కార్యాలయం , అధికారిక కార్యాలయంగా వాడుకున్న తాజా మాజీలు వారు ఓడిపోవడంతో వాటిని వీడేందుకు ససేమీరా అంటున్నారు. తెలంగాణ రాష్ర్టంలో రెండవ విడతలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటికి పైగా వెచ్చించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మించింది ప్రభుత్వం. అక్కడ తిష్టవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవి సొంత ఆస్తులుగా భావించారు. అక్కడ ఫర్నిచర్ లను అందంగా తిర్చిదిద్ధడంతో పాటు హైటెక్ సొబగులు అద్దారు. కంప్యూటర్ సామగ్రి తో పాటు ఖరీదైన ఏసీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చుకున్నారు. కానీ ఎమ్మెల్యేలుగా ఓడిన తరువాత అధికారిక నివాసంను వదలాలంటే

మాత్రం వారికి మనసొప్పడంలేదు. దాంతో ఈ నెల 3న ఫలితాలు వెలువడిన తరువాత తాజా మాజీలు వాటిని ఖాళీ చేసేందుకు ఒప్పకోవడం లేదు. ఈ నెల 3న రాత్రి కొందరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నుంచి సామగ్రి తరలింపు ప్రారంభమైంది. సోమవారం రాత్రి బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్ లు, ఇతర వస్తువులు తరలిస్తున్నారని తెలిసి కాంగ్రెస్ నాయకులు బోధన్ క్యాంపు ఆఫీస్ వద్దకు చేరుకోవడంతో రాత్రి వారికి బీఆర్ ఎస్ మధ్య గొడవ జరిగింది. కార్యాలయంలో వస్తువులు చోరీ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ నేత శరత్ రెడ్డి ఆరోపించారు. క్యాంపు ఆఫీస్ ఫర్నిచర్ తరలించేందుకు బీఆర్ ఎస్ నాయకులు తాళాలు పగలగొట్టి ఫ్యాన్లు, ఏసీల తో పాటు ఫర్నిచర్ దొంగతనంగా తీసుకెళ్తుండగా ఆ వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని అక్కడ లభించిన కండోమ్ ప్యాకెట్లను వారు చూపించారు. పోలీస్ లు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి గొడవను సద్ధు మణిగించారు. ఫర్నిచర్ దొంగిలించిన, ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలోనూ ఏసీలను, కంప్యూటర్ లను, సామగ్రి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కలాపాలు సాగించినా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల బాధ్యతను చూడాల్సిన రోడ్లు భవనాల శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed