నిజామాబాద్ డీసీసీబీలో అసమ్మతి బావుటా

by Sridhar Babu |
నిజామాబాద్ డీసీసీబీలో అసమ్మతి బావుటా
X

దిశ ప్రతినిధి ,నిజామాబాద్ : భారత రాష్ర్ట సమితి అధికారం కోల్పోయిన వంద రోజులకు నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ముసలం పుట్టింది. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై సొంత పార్టీ డైరెక్టర్ లు తిరుగుబాటు ప్రకటించారు. సోమవారం 15 మంది డైరెక్టర్ లు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసంను ప్రకటించి డీసీఓకు అవిశ్వాస నోటీస్ లను అందచేశారు. నిజామాబాద్ డీసీసీబీలో ఉప్పు నిప్పుగా ఉన్న చైర్మన్, డైరెక్టర్ ల మధ్య సంబంధాలకు ఆయన పదవికి ఎసరు తెచ్చి పెట్టాయి. భాస్కర్ రెడ్డి తండ్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ చూసుకుని పాలకవర్గంను పట్టించుకోలేదు. ఒంటెద్ధు పోకడలకు పోయాడు అనే విమర్శలను మూటగట్టుకున్నారు. అందుకే డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి స్వయంగా అవిశ్వాస రాజకీయాలను నడపడం విశేషం.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుంగ అనుచరుడైన రమేష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి దగ్గరి బందువు. నిజామాబాద్ డీసీసీబీలో 20 మంది డైరెక్టర్ లు ఉండగా 15 మంది పోచారం భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదపడంతో జిల్లాలో రాజకీయాలు మారిపోతున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు పోచారం భాస్కర్ రెడ్డి సిద్ధమౌతుండగా సొంత పార్టీకి చెందిన డైరెక్టర్ లు ఆయన్ని గద్దె దింపేందుకు పావులు కదపడం విశేషం. వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డీసీఓకు చైర్మన్ పై అవిశ్వాస నోటీస్ లు ఇచ్చిన 15 మంది డైరెక్టర్ లు హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని మెడ్చల్ లో రిసార్టుకు తరలివెళ్లినట్లు తెలిసింది. డైరెక్టర్ లు చేజారకుండా క్యాంపు రాజకీయాలను రమేష్ రెడ్డి షూరు చేశారు.

ఇదిలా ఉండగా కోందరు డైరెక్టర్ లు కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ రెడ్డికి మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల అండదండలు ఉండటంతో ఆయన చైర్మన్ కావడం ఖాయమని చర్చ నడుస్తుంది. కాగా ఈ నెల 21న అవిశ్వాస పరీక్ష పెట్టేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల మూడవ వారం లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని పోచారం భాస్కర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. టికెట్ రాగానే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరగుతుంది. ఒకవేళ ముందే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే అవిశ్వాస పరీక్షకు ముందే కొత్త డీసీసీబీ చైర్మన్ ను ఎన్నుకునే మార్గం సుగుమం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed