ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి

by Sridhar Babu |
ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
X

దిశ, కామారెడ్డి : రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బ్రిటిష్ కాలంలో కొందరికే ఓటు అవకాశముండేదని, మహిళలకు ఓటు హక్కే లేదని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు రాజ్యాంగంలో సమానంగా ఓటు హక్కు కల్పించిందన్నారు. గతంలో ఓటు హక్కు 21 ఏళ్లకు ఉండగా 1989 నుండి 18 ఏళ్లకు కుదించిందని, ఏడాదిలోనాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు.

ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్లో ఎన్నికల నిర్వహణ ఒక ప్రవాసం కాగా మన దేశంలో చక్కటి వ్యవస్థతో మెషిన్ల ద్వారా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తూ కొన్ని గంటలలోనే ఫలితాలు వెల్లడిస్తున్నామని, ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో యువతను మరింత భాగస్వాములను చేసేలా వారిలో ఓటు హక్కు పై అవగాహన కలిగించుటకు ప్రతి యేటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం ఓటును మించి ఏమీ లేదు.. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను సందేశంతో ఎన్నికల సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఓటరుగా నమోదు చేయడం, ఓటరు జాబితా రూపకల్పనలో బూతు స్థాయి అధికారుల పాత్ర కీలకమని, వారి కృషి వల్లే ఎన్నికలు సజావుగా నిర్వహించ గలుగుతున్నామని ఈ సందర్భంగా వారిని అభినందించారు.

ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, వృద్ధులు ఓటు వేయుటకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నదని, ఓటింగ్ శాతం కూడా మెరుగైందన్నారు. అనంతరం నూతనంగా ఓటరుగా నమోదైన యువతీ, యువకులకు కలెక్టర్ ఫొటో ఎపిక్ ఓటరు కార్డులను అందజేశారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లను, దివ్యాంగులను, ట్రాన్స్ జెండర్లను సన్మానించారు. ఓటు ప్రాముఖ్యతపై డివిజనల్, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. అంతకు ముందు కుల, మత, వర్గ, భాషా భేదాలు లేకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ రాజారామ్, డీపీఓ శ్రీనివాస్, ట్రెజరీ అధికారి సాయిబాబా, మత్స్య శాఖ సహాయ సంచాలకులు వరదా రెడ్డి, భూగర్భ జల సహాయ సంచాలకు లు సతీష్ యాదవ్, కలెక్టరేట్ ఏఓలు అహ్మద్, ఎలక్షన్ పర్యవేక్షకులు సాయి భుజంగం, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed