ఎరువులు, విత్తనాలు విక్రయించే డీలర్లు వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి

by Sridhar Babu |
ఎరువులు, విత్తనాలు విక్రయించే డీలర్లు వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి
X

దిశ, కామారెడ్డి : ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే డీలర్లు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే రైతులకు నాణ్యమైన మేలు రకం వాటిని అందించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మనిషి అనారోగ్యానికి గురైతే డాక్టర్ ఎలా అవసరమో రైతన్నల వ్యవసాయానికి మీరు అంతటివారని, అన్నం పెట్టే రైతన్నలను మోసం చేయవద్దని హితవు పలికారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ వారు ఎల్లారెడ్డి డివిజన్ లోని 40 మంది విత్తన, పురుగు మందులు, ఎరువులను విక్రయించే ఇన్ ఫుట్ డీలర్లకు 48 వారాల పాటు నిర్వహించిన వ్యవసాయ విస్తరణ సేవ (డీఏఈఎస్ఐ) డిప్లొమా కోర్సులో ఉతీర్ణులైన వారితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విక్రయదారులకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే రైతులకు సరైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించడంతో పాటు మెళకువలు తెలుప గలుగుతారన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన జిల్లాలో రైతులకు లాభసాటి వ్యవసాయంగా శాస్త్ర, సాంకేతిక పద్ధతులు అవలంబించుటపై అవగాహన కలిగించాలన్నారు. సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్నాయని, విక్రయాలు పెంచాలనే ఉద్దేశంతో రైతులను మోసగించవద్దని కోరారు. వివిధ రకాల పంటలు పండించుట, లేబర్ ను అధిగమించుటకు డ్రోన్ వంటి టెక్నాలజీ వినియోగించుట, పంటలకు రోగాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు.

ఈ నెలలో ఎల్లారెడ్డి డివిజన్ లో మిగిలిన విక్రయదారులతో పాటు బాన్సువాడ, బిచ్కుంద డివిజన్ లో 40 మంది చొప్పున డిప్లొమా కోర్సులో శిక్షణ ఇవ్వనున్నామని, ఈ కోర్సులకు హాజరు కావాలని కలెక్టర్ కోరారు. అనంతరం బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన రవీందర్ రెడ్డి, సంతోష్, సాయిచరణ్ లను శాలువాలతో సన్మానించి పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. డిప్లొమా కోర్సులో ఉతీర్ణులైన మిగతా వారికి కూడా జ్ఞాపిక, సర్టిఫికెట్ లను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి తో కలిసి అందజేశారు. అలాగే ఫెసిలిటేటర్ రామచంద్ర రావు ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రత్న, భారతి, లక్ష్మీప్రసన్న, సునీత రాణి, హరీష్ కుమార్, శ్రీకాంత్, అనిల్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed