కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్య: మంత్రి

by Naveena |
కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్య: మంత్రి
X

దిశ,నల్లగొండ: కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గంధంవారి గూడెం వద్ద రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ పాఠశాల పైలాన్ ఆవిష్కరించి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ , తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు.ఈ పాఠశాలల్లో చదువుతోపాటు ,అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు. 5000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

నల్గొండలో చేపట్టిన ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పేదవాడు చదువుకుంటేనే కుటుంబంతో పాటు..రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అందువల్ల పేదలందరూ తమ పిల్లలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ పాఠశాలలను చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ,త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంలో భాగంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రెండు లక్షల కన్నా మించి రుణాలు ఉన్నవారి రుణాలు కూడా త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పేదవారికి, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడమే తన ధ్యేయమన్నారు. జిల్లాలో ఎస్ ఎల్ బి సి సొరంగంతో రెండు పంటలకు సాగునీరు అందించేందుకు, ఎస్ఎల్బీసీ టన్నల్ మిషన్ విడిభాగాలను అమెరికా నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్ ఎల్ బిసి తో శ్రీశైలంలో డెడ్ స్టోరేజీలో నీరున్నప్పటికీ సైతం నల్గొండ జిల్లాకు సాగునీరు అందుతుందని తెలిపారు.

గత సంవత్సరం కరువు కారణంగా జిల్లాలో పంటలు పండలేదని, ఎస్ఎల్బీసీ పూర్తయితే రెండు సంవత్సరాలలో 4 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని మంత్రి వెల్లడించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువతో నీరు వదిలినప్పటికీ కాలువలలో చెట్లు, ముళ్ళపదలు, పూడిక కారణంగా చివరి వరకు సాగునీరు అందదన్న ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి కాలువల్లో మరమ్మతులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కృష్ణా నీటితో జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్ళు కడిగినప్పుడే తన కల నెరవేరుతుందని అన్నారు. బ్రాహ్మణ వెల్లేముల తో సాగునీరు ఇచ్చేందుకుఇటీవలే 25 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు . నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన మెడికల్ కళాశాల పూర్తి చేసేందుకు 45 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, పనులు పూర్తయ్యాయని, నవంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలతో అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇండ్లు లేని పేదవారికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ,రానున్న నాలుగున్నర సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా ,అన్ని ప్రభుత్వ అభివృద్ధి పథకాలను అందిస్తామని తెలిపారు. 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు.

Advertisement

Next Story