PCC Chief: కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించే ప్రసక్తే లేదు

by Gantepaka Srikanth |
PCC Chief: కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించే ప్రసక్తే లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని, ఎలాంటి ఆధారాలు లేని వ్యాఖ్యలేనని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆమెను కేబినెట్ నుంచి తొలగించే అంశమే ఉత్పన్నం కాదని, ఆమె ఇప్పుడున్నట్లుగానే మంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వెంటనే తాను పీసీసీ చీఫ్‌గా ఆమెతో మాట్లాడానని, గంటల వ్యవధిలోనే ఆమె తన తప్పును తెలుసుకుని సమంతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించున్నారని వివరించారు. ఆ ఇష్యూ అప్పుడే క్లోజ్ అయిందని, ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరమే లేదన్నారు. మీడియాతో శుక్రవారం చిట్‌చాట్ సందర్భంగా పీసీసీ చీఫ్ పై క్లారిటీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా దాఖలు చేసిన పరువునష్టం దావాలపై ఆయన రియాక్ట్ కావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్‌లో సీనియర్లు మాత్రమే కాక తెలంగాణ సమాజంలో రాజకీయంగా కొండా సురేఖ, సీతక్క బలమైన నాయకులు, సామాజికవర్గాలుగా చూస్తే బీసీ, ఎస్టీలు అయినందునే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వారిని టార్గెట్ చేస్తున్నదన్నారు.

బీఆర్ఎస్ నుంచి త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని, ఇప్పటికి చేరినవారు కాంగ్రెస్‌తోనే ఉన్నారని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ విధానాలు నచ్చినందునే రాష్ట్ర పునర్ నిర్మాణం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్‌ను వీడి రావడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దీనికి తోడు దిశానిర్దేశం, దిక్కుమొక్కు లేని తీరులో బీఆర్ఎస్ ఫంక్షనింగ్‌తోనూ, నాయకత్వ వైఖరితోనూ వారు విసుగుచెందారని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాను బాధ్యత లేని తీరులో వాడుకుంటున్నదని, డబ్బులు వెదజల్లి అనైతిక పద్ధతుల్లో పోస్టింగులు పెట్టిస్తున్నదని మహేశ్‌గౌడ్ ఆరోపించారు. గత పదేండ్లలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాధ్యతతో వ్యవహరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరులో చిల్లరగా ఎన్నడూ లేమన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను బద్నాం చేయడంతో పాటు ప్రజల్లో గందరగోళపరుస్తూ తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. సోషల్ మీడియా వింగ్‌ను దిగజారుడు ధోరణిలో నడిపిస్తున్నదని ఆరోపించారు.

బీసీలపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉన్నదని, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే క్లారిటీ ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కండ్ల ముందు కనిపిస్తున్న కార్యాచరణ ప్రజలందరికీ తెలుసని అన్నారు. బీసీ రిజర్వేషన్లు, పార్టీలో ప్రాధాన్యతలపై వివరిస్తూ పీసీసీ చీఫ్‌గా తనకు ప్రాతినిధ్యం కల్పించడం కూడా బీసీ వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న హైకమాండ్ ఆలోచనతోనే అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల బీసీల ప్రాధాన్యత గురించి పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వినిపిస్తున్నారని, పార్టీ సమావేశాల్లోనే ఆయనకు పీసీసీ చీఫ్‌‌గా క్లారిటీ ఇచ్చానని గుర్తుచేశారు. బీసీల గురించి తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఆ సామాజికవర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసమే తప్ప పార్టీపైన అసంతృప్తి, అసహనంలో భాగం కాదని వివరించారు. ఆ మాటలను పరిగణనలోకి తీసుకుని పార్టీ లైన్ తప్పినట్లుగా భావించలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. పార్టీ లీడర్‌షిప్‌కు ఆయన అప్పీల్ చేస్తున్నారేగానీ విధానాన్ని తప్పుపట్టడం లేదని వివరించారు.

బీఆర్ఎస్, బీజేపీ చాలా కాలంగా స్నేహసంబంధాల్లో ఉన్నాయని, ఇప్పటికీ ఆ బంధం కొనసాగుతున్నదన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం ప్రజలకు బహిర్గతమైందని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితకు బెయిల్ రావడానికి బీజేపీ సహకారం ఉన్నదన్నారు. ఇదే స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి ఏడాదిన్నర పట్టిందని, కవితకు ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య కనిపించని బంధం కంటిన్యూ అవుతుందన్నారు. హర్యానాలో బీజేపీ గెలిచినందుకు బీఆర్ఎస్ తెలంగాణలో సంబురాలు చేసుకున్నదని, కాంగ్రెస్ ఓడిందనే అక్కసును వెళ్ళగక్కిందన్నారు. ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ ఉమ్మడి శత్రువు కావడంతోనే వాటి మధ్య దోస్తానా కంటిన్యూ అవుతున్నదన్నారు.

మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నదని, నిర్వాసితులమీద ప్రేమ ఒలకబోస్తున్నదని మహేశ్‌గౌడ్ ఆరోపించారు. నిజానికి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనిదేనని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ ఖరారు చేయలేదని, కానీ ఖర్చు లక్షన్నర కోట్లు అంటూ కేటీఆర్ సహా పలువురు పాట పాడుతున్నారని అన్నారు. మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది కాలుష్యాన్ని నివారించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి, వరదల సమయంలో నగర జనానికి రక్షణ కల్పించేందుకనేనని నొక్కిచెప్పారు. రివర్ బెడ్‌లో ఉన్నవాళ్ళ ఇండ్లను కూల్చేసేందుకే ఈ ప్రాజెక్టు అంటూ ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఒక ప్రాజెక్టులోని అంశాలన్నారు.

త్వరలోనే జిల్లా పర్యటనలు చేస్తానని, ఆ తర్వాతనే పార్టీ జిల్లా కమిటీల కూర్పు ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. నెల రోజుల్లో కంప్లీట్ అవుతుందన్నారు. దసరా లోపే ఈ పోస్టులకు పార్టీ నాయకులను ప్రకటించాలని అనుకున్నామని, కానీ ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, నిర్ణయం తీసుకోడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్‌కు అవగాహన ఉన్నదే తప్ప పొత్తు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని మహేశ్‌గౌడ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలను మజ్లిస్ పార్టీ అనుకూలంగా మల్చుకుంటున్నదని తమ పార్టీకి చెందిన ఫిరోజ్‌ఖాన్ కొన్ని అంశాలను తన దృష్టికి తీసుకొచ్చారని, సీఎం రేవంత్‌తో మాట్లాడి త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ఒకవేళ ఆయన అదుపు తప్పి వ్యవహరిస్తే సొంత పార్టీ వ్యక్తే అయినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. తప్పు ఏ పార్టీవారు చేసినా విధానం ఒకేలా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed