ఇంటింటి సర్వేలో ఐదు అంశాలు.. 60 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-11 17:09:02.0  )
ఇంటింటి సర్వేలో ఐదు అంశాలు.. 60 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కులగణనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం..60 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటినీ (కుటుంబాన్ని) కలిసి అందరి వివరాలను సేకరించేలా షెడ్యూలు ఖరారు చేసింది. ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు అంశాలపై (కులాన్ని కూడా కలిపితే ఆరు అంశాలు) దృష్టి పెట్టనున్నది. ఒకవైపు కులాలవారీగా వివరాలను సేకరించడంతో పాటు ఈ ఐదు అంశాలపైనా సమగ్రమైన డాటాను తీసుకోనున్నది. విద్య, ఉపాధి (ఉద్యోగ), సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నది. ప్రస్తుతం ఆయా కుటుంబాలకు లభిస్తున్న అవకాశాలను బేరీజు వేసుకుని భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన అవకాశాలపై నిర్ణయం తీసుకోడానికి ఈ డాటా ఉపయోగపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓటర్లు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చడంతో పాటు రాజకీయపరంగా వారి వెనకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఈ సర్వే దోహదపడనున్నది.

ఆ అంశాలపై ఈ సర్వే ద్వారా వివరాలు లభించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడానికి వీలుగా రిజర్వేషన్‌ను స్టేట్ బీసీ కమిషన్ ఖరారు చేయనున్నది. ఇంటింటి సర్వే ద్వారా ఈ వివరాలను సేకరించే స్టేట్ బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు... అన్ని కులాల వివరాలనూ సేకరిస్తాయి. కులాలతో పాటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా వారి వెనకబాటుతనాన్ని కూడా సర్వే ద్వారా తెలుసుకుంటాయి. ఎస్సీ కులాల జనాభా వివరాలు కూడా ఈ సర్వే ద్వారా తేలుతున్నందున ఎస్సీ వర్గీకరణలో కులాలు, ఉప కులాలను గ్రూపులవారీగా విభజించడానికి, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా లభించిన సౌకర్యాలపైనా స్పష్టత వస్తుంది. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా ఈ సర్వే ద్వారా వెల్లడైనా డాటా ఉపయోగించుకోడానికి ప్రభుత్వానికి వెసులుబాటు లభిస్తుంది.

కులగణన ద్వారా అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు ఇటు ఎస్సీ వర్గీకరణలో గ్రూపులవారీగా ఫార్ములా రూపొందించడానికి కూడా యూజ్ కానున్నది. ఈ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి (డోర్ టు డోర్) చేయనున్నందున అరవై రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకు అవసరమైన ప్లానింగ్, సిబ్బంది కేటాయింపు, వర్క్ డివిజన్, షెడ్యూలు ప్రిపరేషన్.. ఇలాంటివన్నీ స్టేట్ ప్లానింగ్ బోర్డు, స్టేట్ బీసీ కమిషన్ సంయుక్తగా రూపొందించనున్నాయి. దీన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా కేటాయిస్తున్నది. ప్రభుత్వం 60 రోజుల గడువు ఇచ్చినందున తొలుత అనుకున్న ప్రకారం డిసెంబరు 9వ తేదీ నాటికి ఈ డాటా మొత్తం సిద్దం కానున్నది. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను సాఫ్ట్ వేర్ వినియోగానికి అనుకూలంగా ఉండేలా ప్రతీ రోజు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధానంపై అధికారులు ఆలోచిస్తున్నారు.

కేవలం స్థానిక సంస్థల్లో బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు ఉపయోగపడేలా మాత్రమే కాక భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందించాల్సిన సంక్షేమ పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టాల్సిన స్కీములు తదితరాలపైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల కులాల కుటుంబాలకు మాత్రమే కాక ఇతర బలహీనవర్గాల ఫ్యామిలీస్‌కు కూడా ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందించడానికి ఈ డాటా ఉపయోగపడనున్నది. ప్లానింగ్ డిపార్టుమెంట్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించినందున మళ్ళీ జనాభా లెక్కల ప్రక్రియ (కేంద్ర ప్రభుత్వం చేసే) పూర్తయ్యేంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలనే ప్రామాణికంగా తీసుకోనున్నది. ఎస్సీ వర్గీకరణకు మాత్రం 2011 నాటి జనాభా లెక్కలను క్రైటీరియాగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Read More..

తెలంగాణలో సమగ్ర కులగణనపై జీవో జారీ

Advertisement

Next Story

Most Viewed