AIMIM : మజ్లిస్ నేతలపై కేసుల ఉపసంహరణ.. కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం

by Hajipasha |
AIMIM : మజ్లిస్ నేతలపై కేసుల ఉపసంహరణ.. కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ 16న ఓల్డ్ హుబ్బలి పోలీసు స్టేషను వద్ద ముస్లింలతో కలిసి నిరసనల్లో పాల్గొన్న మజ్లిస్ నాయకులు సహా మొత్తం 138 మందిపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్స్‌తో ఓ మసీదుపై బీజేపీ కమలం గుర్తును అతికించి.. ఆ ఫొటోను కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీన్ని చూసిన ముస్లింలు ఆగ్రహంతో ఓల్డ్ హుబ్బలి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకొని నిరసనకు దిగారు.

ఇందులో పెద్దసంఖ్యలో మజ్లిస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొందరు నిరసనకారుల దాడిలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కొన్ని పబ్లిక్ ప్రాపర్టీలు ధ్వంసమయ్యాయి. దీంతో 138 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో కర్ణాటకలో అధికార పీఠంపై బీజేపీ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయా కేసులను వెనక్కి తీసుకుంది. ముస్లింలను మచ్చిక చేసుకొని రాజకీయ ప్రయోజనం పొందేందుకే కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు.

Advertisement

Next Story