డీఎస్ మరణంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల నాయకున్ని కోల్పోయింది : సీఎం

by Kalyani |
డీఎస్ మరణంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల నాయకున్ని కోల్పోయింది : సీఎం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ; కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అత్యున్నత పీసీసీ అధ్యక్ష పదవిని మూడుసార్లు విజయవంతంగా నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల నాయకున్ని కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి ఆనాడు మహాకూటమి ఏర్పాటులో రాజకీయ శక్తులను ఏకీకరణలో డీఎస్ ఎంతో కృషి చేశారు అన్నారు. 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సోనియాగాంధీకి చెప్పడంలో డిఎస్ పాత్ర మరువలేనిదని అన్నారు. డీఎస్ చొరవతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ కరీంనగర్ లో ప్రకటన చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డీఎస్ అని పేర్కొన్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లా గాంధీ కుటుంబానికి ధర్మపురి శ్రీనివాస్ వీర విధేయుడిగా ఉన్నారని తెలిపారు. డీఎస్ కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి దూరమైనా పార్లమెంట్ లో డీఎస్ ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారు అని దానికి తానే ప్రత్యక్ష సాక్షి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి డిఎస్ మళ్లీ వస్తానని తనను సంప్రదించారని అప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏమైనా పదవులు కావాలని అడిగితే పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంచలంచలు ఎదిగిన విశ్వాసంతో తానుచనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక అని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టకర పరిస్థితులలో శనివారం డిఎస్ హఠాన్మరణం విషయం తెలిసి కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నాయకులను పంపి వారి పార్థివదేహం పై కాంగ్రెస్ జెండాను ఉంచి వారి కోరిక తీర్చాము అన్నారు.

డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది అన్నారు. డీఎస్ మరణం విషయం తెలిసి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తన సంతాపాన్ని తెలిపారని, పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ త్వరలోనే తన సంతాప సందేశాన్ని తెలుపుతారన్నారు. ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ అందుకే ఆయన అంత్యక్రియలను అధికారులు లాంఛనాలతో చేయాలని సి ఎస్ ను ఆదేశించినట్టు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులను సెక్రటరీ కి పిలిపించుకొని వారి కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు.

డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏ ఐ సి సి నాయకులు మధుయాష్కి గౌడ్, వి హనుమంతరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లతోపాటు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి డాక్టర్ భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవ వేణు నాయకులు ముప్పగంగారెడ్డి, జావిరక్రం తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed