IAF Helicopter: బీహార్‌ వరద సహాయక చర్యల్లో ఎమర్జెన్సీ వాటర్ ల్యాండింగ్ చేసిన ఐఏఎఫ్ హెలికాప్టర్

by S Gopi |
IAF Helicopter: బీహార్‌ వరద సహాయక చర్యల్లో ఎమర్జెన్సీ వాటర్ ల్యాండింగ్ చేసిన ఐఏఎఫ్ హెలికాప్టర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వరద సహాయక చర్యల్లో ఉన్న సమయంలో వాటర్ ల్యాండింగ్ చేసింది. సహాయక చర్యలు నిర్వహిస్తున్నప్పుడు హెలికాప్టర్ బ్లేడ్‌లలో ఒకటి విరిగిపోవడంతో ముందుజాగ్రత్తగా వాటర్ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌లో ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో స్థానికులు ఆ వీడియోను తీశారు. హెలికాప్టర్ క్యారియర్ నుంచి ఆహార ప్యాకెట్లను సురక్షితంగా బయటకు తీశారు. సహాయక సామగ్రిని అందించిన తర్వాత హెలికాప్టర్ దర్భంగా నుంచి వచ్చిన సమయంలో ఘటన జరిగిందని సీనియర్ సూపరింటెంటెండ్ ఆఫ్ పోలీస్ రాకేష్ కుమార్ చెప్పారు. హెలికాప్టర్ ఔరాయ్ బ్లాక్‌లోని నీటితో నిండిన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌లో అందరూ ఐఏఎఫ్ సిబ్బందే ఉన్నారు. వారందరినీ స్థానికులు బయటకు తీసుకొచ్చారని, ఆ తర్వాత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఏఎఫ్ సిబ్బందీ అందరూ క్షేమంగా ఉన్నారని, అవసరమైతే ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. కాగా, బీహార్‌లో గత కొన్ని రోజులుగా వరదలు కొనసాగుతున్నాయి. దీనివల్ల 11 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు.

Next Story

Most Viewed