- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ప్రపంచకప్ మీదే టీమిండియా సివంగుల గురి!
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా మహిళల జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ సేన రెండు ప్రపంచకప్ సన్నాహక మ్యాచులు ఆడగా.. రెంటింటిలోనూ ఘన విజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వార్మప్ మ్యాచులో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. యూఏఈ వేదికగా 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. అందుకోసం అన్ని ఏర్పాట్లను సైతం చేసింది.
రెండు సార్లు అందినట్లే అంది..
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఈసారి భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. వాస్తవానికి భారత మహిళా జట్టు ఇప్పటికే ప్రపంచకప్‌ను ముద్దాడాల్సి ఉంది. కానీ, చిక్కినట్లే చిక్కి రెండు సార్లు కప్ చేజారింది. 2020లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. అది మిగిల్చిన వేదన అంతా ఇంతా కాదు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత జట్టుకు నిరాశే మిలిగింది. ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచులో దూకుడుగా ఆడినా.. కప్‌ను ముద్దాడలేకపోయింది. విజయానికి చేరువుగా వెళ్లి ఓటమి పాలైంది. మొత్తంగా ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ 3 సార్లు భంగపాటుకు గురైంది. గత ఓటముల నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాలను దృష్టిలో ఉంచుకుని ఈసారైనా టీమిండియా మహిళల టీం ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా? తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటుందా? అనేది వేచి చూడాలి.
జట్టు బలంగా కనిపించినా..
2024 టీ20 వరల్డ్ కప్‌లో బలమైన జట్లలో భారత మహిళల బృందం కూడా ఒకటి. లాస్ట్ టైం సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసితో ఉన్నది. ఈ క్రమంలోనే గ్రూప్-ఎలో ఉన్న భారత జట్టు శుక్రవారం దుబాయ్‌లో న్యూజిలాండ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. వార్మప్ మ్యాచులో టీమిండియా పర్ఫామెన్స్ భాగానే ఉన్నా.. గ్రూపు మ్యాచుల్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే గత రెండు నెలలుగా టీమిండియా మహిళా జట్టు ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడలేదనేది వాస్తవం. జులైలో శ్రీలంకతో జరిగిన ఆసియాకప్ ఫైనలే ఆఖరి మ్యాచ్. రెండు నెలల పాటు జట్టు సుదీర్ఘంగా సాధన చేసింది. ఈసారి చాంపియన్‌గా నిలవడానికి భారత్‌కు అవసరమైన అన్ని వనరులున్నాయి.
వాళ్లే జట్టుకు బలం..
టీమిండియా మహిళల జట్టులో ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన అద్భుతమైన ఫాంలో ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం జట్టుకు బలం. వీరి తర్వాత ఫాం లేమితో కొంతకాలం ఇబ్బంది పడిన జెమీమా ప్రస్తుతం దూకుడుగా ఆడటం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇక సూపర్ హిట్టర్ రిచా ఘోష్ బెస్ట్ ఫినిషర్‌గా కనిపిస్తోంది. ఇది జట్టుకు బాగా కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ఆమె కీలక మ్యాచుల్లో రాణించడం కూడా ముఖ్యమే. ఇక హేమలత మూడో స్థానంలో నెమ్మదిగా కుదురుకుని పరుగుల వరద పారించడానికి కసరత్తు చేస్తోంది. మన బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. దీప్తి శర్మ, రాధ, ఆశా శోభన, శ్రేయాంకలు అద్భుతంగా రాణిస్తున్నారు. స్పిన్, పేస్ ఇలా రెండింటిలోనూ మనవాళ్లు పటిష్టంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రేయాంగ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక పేస్‌లో రేణుక సింగ్ కొత్త బంతితో రాణించడం జట్టు కీలకంగా మారనుంది. పూజ వస్త్రాకర్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కూడా జట్టులో కుదరుకున్నారు. దుబాయ్, షార్జా వేదికలు పేస్ బౌలర్లకు పెద్దగా అనుకూలించవని తెలుస్తోంది.
గత రికార్డులు పరిశీలిస్తే..
గ్రూప్-ఏలో టీమిండియాకు అన్ని బలమైన జట్లే ఎదురుకానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్‌లతో హర్మన్ సేన పోరాడాల్సి వస్తుంది. ఇటువంటి జట్లతో తలపడి సెమీస్‌కు చేరడం అంత ఈజీ కాదు. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో శ్రమించాల్సి వస్తుంది. గ్రూపు స్టేజీలో నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు నెగ్గాలి. అద్భుతమైన ఆటతీరుతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే జట్టు ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఆస్ట్రేలియానే తొలి అడ్డంకి..
ఆస్ట్రేలియా జట్టు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటికే 6 ప్రపంచ కప్‌లను ముద్దాడింది. ఇప్పటివరకు ఆసీస్‌తో టీమిండియా 34 టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో భారత్ 8 మాత్రమే గెలిచింది. ఇక న్యూజిలాండ్ కూడా భారత్ జట్టుపై మెరుగైన రికార్డును కలిగి ఉంది. కివీస్‌తో భారత్ 13 మ్యాచులు ఆడగా.. అందులో భారత్ 4 మాత్రమే గెలుపొందింది. ఇక పాకిస్థాన్‌పై భారత్ 12 సార్లు నెగ్గగా 3 సార్లు ఓడింది. శ్రీలంకపై భారత్ 18సార్లు గెలిస్తే 5 సార్లు ఓడింది. అయినప్పటికీ ఈ రెండు జట్లను తేలికగా తీసుకోలేం. ఈ ఏడాది మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్‌కు శ్రీలంక షాకిచ్చిన విషయం తెలిసిందే. అందుకే చిన్న జట్టు అయినా, పెద్ద జట్టు అయినా విజయమే లక్ష్యంగా హర్మన్ ప్రీత్ సేన పోరాడాల్సి ఉంటుంది. గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకుండా పొదుపుగా, జాగ్రత్తగా ఆడితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ ముద్దాడటం ఖాయం. ఇక అదే జరిగితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారధ్యంలో తొలి ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా జట్టు కొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. జట్టు సారధిగా హర్మన్ ప్రీత్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.