Fake Doctors: రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్‌లో నకిలీ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నం

by S Gopi |
Fake Doctors: రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్‌లో నకిలీ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యుల సర్టిఫికెట్లు, నకిలీ పత్రాలను ఉపయోగించి రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ (ఆర్ఎంసీ) కింద అనేక మంది అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా నమోదు చేసుకున్నారని అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ మీడియా ప్రకారం.. ఎటువంటి మెడికల్ డిగ్రీ లేని వ్యక్తులు ఆర్ఎంసీలో నమోదు చేసుకున్నారు. వారిలో చాలా మంది ప్రాక్టీస్ చేయడం కూడా ప్రారంభించారు. ఆర్ఎంసీ వద్ద నమోదు చేయాలంటే పత్రాలను సమగ్రంగా ధృవీకరించడం తప్పనిసరి. ఇతర రాష్ట్ర వైద్య మండలిలో ఇప్పటికే నమోదు చేసుకున్న వైద్యులు తప్పనిసరిగా వారి అర్హతలను రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, ఈ కేసులో 'వైద్యులు' రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ల (ఎన్‌ఓసీ) నకిలీ కాపీలను సమర్పించారు. వాటిని ఆర్ఎంసీ ధృవీకరించడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో మంగళవారం రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ (ఆర్‌ఎంసీ) రిజిస్ట్రార్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు వార్తా సంస్థ పీటీఈ పేర్కొంది. ఈ విషయాన్ని చట్టపరంగా పరిశీలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 'మేము కేసులో ఏదైనా అవినీతి కోణం కనిపిస్తే లేదా అవినీతిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రమేయం ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాము' అని ఏసీబీ డిజి డాక్టర్ రవి ప్రకాష్ మెహర్దా వెల్లడించారు.

Advertisement

Next Story