రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది

by Sridhar Babu |
రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది
X

దిశ, బోధన్ : రానున్న రెండు లేక ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని బోధన్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ మంగళవారం బోధనలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి తరువాత మంగళవారం నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు నాయకులు కంటతడి పెట్టారు. ఈ సమావేశంలో షకీల్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పుని కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని గౌరవిస్తామని, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, గ్రూపులతో కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకొని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని జోష్యం చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి హాని చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే బోధన్​లో తమ పార్టీ కార్యకర్తలపై,

మైనార్టీ యువకులపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దాడులకు, కేసులకు భయపడేది లేదని ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇన్నాళ్లు తమ పార్టీలో చెంచాగిరి చేసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో దౌర్జన్యాలకు దిగబడుతున్నారని, తాను మూడో కన్ను తెరిస్తే ఆ నేతలు భష్మం అవుతారని, భవిష్యత్తు ఏంటో తేల్చుకోవాలి అని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో గౌరవంగా వ్యవహరించారని, చిల్లర వ్యక్తులను ప్రోత్సహించి ఆయనకున్న గౌరవాన్ని కోల్పోవద్దన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సామగ్రిని దొంగతనం చేసేందుకు కుట్రలు చేశారని, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని ప్రచారం చేసే క్రమంలో కండోమ్ బాక్సులు వేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పనికిమాలిన నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కేసీఆర్ లేని తెలంగాణ పాలనను ఊహించుకోలేమని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలని లేదంటే ప్రజలు నిలదీయాలన్నారు. రైతు బంధు ను తక్షణమే విడుదల చేయాలని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల నుంచి ఎవరు కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. కుట్రలు పన్ని తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్ధవార్ గంగారెడ్డి, బుద్దే రాజేశ్వర్, వెంకటేశ్వరరావు దేశాయ్, నర్సింగరావు , సోహెల్, నియోజకవర్గ సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed