సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

by Naveena |
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
X

దిశ, కామారెడ్డి : సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుండడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని అన్నారు. గత ప్రభుత్వం కూడా వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని మభ్యపెడుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని, ఉద్యోగ భరోసా కల్పిస్తామని ప్రకటించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను స్వయంగా వారితో మాట్లాడి మీ సమస్యలను మా ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందిస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేయడం మంచిది కాదని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు సమ్మెలో ఉండడంతో..కేజీబీవిలో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆరోపించారు. విద్యాశాఖ కార్యాలయాల ఆపరేటర్స్ లేకపోవడంతో మూసివేస్తున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ప్రభుత్వం వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో విద్యాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రావణ్, అజయ్, అభిలాష్ తదితరు పాల్గొన్నారు.

Advertisement

Next Story