సీఎం టూర్ ఎఫెక్ట్.. వీఆర్‌కు పట్టన సీఐ, మూడవ టౌన్ ఎస్ఐ

by Mahesh |
సీఎం టూర్ ఎఫెక్ట్.. వీఆర్‌కు పట్టన సీఐ, మూడవ టౌన్ ఎస్ఐ
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన ఇద్దరు పోలీస్ అధికారుల పోస్టులకు ఎసరు పెట్టింది. నగర సీఐ కృష్ణను, మూడవ టౌన్ ఎస్ఐ సాయినాథ్ లను నిజామాబాద్ వీఆర్ కు పంపుతూ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం పర్యటన సందర్భంగా ఆయన పర్యటనను ప్రతి పక్షాలు, విద్యార్థి సంఘాలు అడ్టుకుంటాయనే నిఘా సంస్థలు అప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. దీంతో సీఎం సైతం రోడ్ పర్యటన కాకుండా హెలిక్యాప్టర్ లో నగరానికి వచ్చారు.

సీఎం పర్యటనకు గంటల ముందే వామ పక్ష నాయకులను, విద్యార్థి సంఘాల నేతలను, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీస్ శాఖ ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌లకు తరలించారు. గత కొన్ని రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న వీఆర్ఏ లను సైతం పోలీసులు వదలకుండా అరెస్టు చేశారు. అయితే నిజామాబాద్ బల్దియాలో ఏకైక కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ తో పాటు మరి కొందరిని పోలీసు అధికారులు ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన విఫలం అయ్యారు.

దాన్ని అవకాశంగా తీసుకున్న కార్పొరేటర్, ఆయనతో పాటు మరి కొందరు సీఎం కాన్వాయ్ లో కలెక్టరేట్ కు వస్తుండగా నల్ల జండాలను ధరించి గో బ్యాక్ సీఎం అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై స్థానిక రూరల్ పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులను, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేయాలని ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సీఎం పర్యటనకు ముందు బయట ఎలా తిరుగుతున్నారని ఆరా తీశారు.

అసలు విషయం తెలుసుకున్న అధికారులు సీఐ కృష్ణను, మూడవ టౌన్ ఎస్ఐ సాయినాధ్ లను వెకెన్సి రిజర్వుకు పంపుతు ఉన్నపళంగా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం టూర్ సమయంలో బందోబస్తు డ్యూటిలో నిర్లక్ష్యం చేసిన అధికారులను భాధ్యతల నుంచి సస్పెండ్ చేయాలని అదేశాలు వచ్చినా కేవలం వీఆర్‌కు అటాచ్డ్ చేశారనే వాదనలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed