పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాంరాం.. సీఎం కేసీఆర్

by Sumithra |   ( Updated:2023-10-30 11:51:27.0  )
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాంరాం.. సీఎం కేసీఆర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమేనని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గంటలు మాత్రమే కరెంటు ఇస్తుందని అక్కడ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒప్పుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం జుక్కల్ నియోజకవర్గంలో జరగిని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎలక్షన్ లు వచ్చినప్పుడు అనేక మంది వస్తారు, ఆగం ఆగం కాకుండా విచక్షణతో ఓటు వేయాలి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నేను చెప్పిన నాలుగు మాటలను ఊర్లలోకి వెళ్లి పది మందితో చర్చించండి, బీఆర్ఎస్ ను బలపరచండి అన్నారు. గతంలో కరెంట్ లేక, నీళ్ళు లేక ఎన్నో బాధలు భరించినం, ఇప్పుడా బాధలు లేవు అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళం అన్నారు.

జుక్కల్ లో మంచి నీళ్ళ కోసం బాధ పడ్డాం, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా నీళ్ళ సరఫరా చేస్తున్నాం అని తెలిపారు. మంచి చెడ్డను చూసి ఆలోచించి ఓటేయ్యండి అని పిలుపునిచ్చారు. మీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మంచి వాడు ఎప్పుడు నా దగ్గరకి వచ్చి వ్యక్తిగత పనులను అడగలేదు జుక్కల్ అభివృద్ది కోసం అడిగాడు అని పొగిడారు. మీ ఎంపీ బీబీ పాటిల్ ఎంతో శ్రద్దతో జాతీయ రహదారులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. మూడు రాష్ట్రాల సంగమ ప్రాంతం మీది దానిని అభివృద్ధి చేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కర్ణాటకలో సరిగా కరెంట్ ఇస్తలేరు, కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్ కే గొప్ప అంటున్నారు. మన దగ్గర 24 గంటల కరెంట్ ఇస్తున్నాం దానిని ప్రజలు గమనించాలన్నారు. రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలి అని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు రామ్ రామ్ అవుతుందని, రైతుల కష్టాలను తీరుస్తున్న ధరణి పోర్టల్ ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పాలనలో అంజిమాన్ లో లోన్ లు ఉంటే ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు అని గుర్తు చేశారు. రైతు భీమా చేసినం బాధితులకు వారం రోజుల్లో 5 లక్షలు అందిస్తున్నాం. అదేవిధంగా రెండు దఫాలుగా 37 వేల కోట్ల రుణ మాఫీ చేసుకున్నాం అని తెలిపారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని ఈ విషయంలో గర్వంగా ఉందన్నారు. విద్యుత్ వినియోగంలో 22 వందల యూనిట్ల సగటు వినియోగంతో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ పేరు గడిచిందన్నారు.

కాంగ్రెస్ ఫిర్యాదుతో రైతు బంధు ఆపినం, ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో వేస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే లెండి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందిస్తాం అన్నారు. నాగ మడుగు ద్వారా 40 వేల ఎకరాలకు నీల్లందిస్తాం అని తెలిపారు. సింగూరు నుంచి నీరు రాకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టు నింపుకొని ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నిజాంసాగర్ మండలంలో మీ కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని తెలిపారు. మిగిలిన వారికి దఫాలుగా అందరికీ అందిస్తాం అని తెలిపారు.

Advertisement

Next Story