ఇందూరు బల్దియాలో మేమే కింగులం..తట్టుకోలేక లొంగి పోయిన బాధితులు

by Aamani |
ఇందూరు బల్దియాలో మేమే కింగులం..తట్టుకోలేక లొంగి పోయిన బాధితులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని, వివిధ విభాగాల్లో జరుగుతున్న ఇతరత్రా వంకర బుద్ధుల్ని ఆపే నాథుడే కరువయ్యాడు. రాజకీయ నాయకులు, కార్పొరేషన్ లో పనిచేసే కొంతమంది అధికారులు అండదండలతో అక్రమార్కులు, పని దొంగలు రెచ్చిపోతున్నారు. సిబ్బంది అధికారులు కుమ్మక్కై కాసుల కక్కుర్తితో అడ్డదారుల్లో దండుకుంటున్నారు. ఖర్చులు చేయకుండానే దొంగ బిల్లులు పెడుతూ లక్షల్లో నొక్కేస్తున్నారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో పని చేయకుండానే అప్పనంగా నెలవారీ వేతనాలను దర్జాగా తీసుకుంటున్నారు.

సంబంధిత విభాగాధిపతులు సహకరిస్తున్నారు. అడ్డదారిలో అక్రమంగా బల్దియా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తిష్ట వేసి పొలిటికల్ లీడర్లు, అధికారుల బంధువులకు సంబంధించిన సిబ్బంది ఆగడాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. హమారే పీచే కౌన్ హై మాలూమ్.. అంటూ అధికారులు బెదిరిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని జాబ్ లో చేరినప్పటి నుంచి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులుగా కాకుండా బల్దియాకు మేనల్లుళ్లు లాగా వస్తూ పోతున్నారే తప్ప పని చేయడం లేదని ఆరోపణలున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులే అసూయ పడేలా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఫోజులు కొడుతుంటే రెగ్యులర్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారుల అండదండలు వారికి పుష్కలంగా ఉండటంతో ఏం చేయలేకపోతున్నారు. ఆయా విభాగాధిపతులు కూడా వారిని అడిగే ధైర్యం కూడా చేయట్లేదు. కొందరు పొలిటికల్ పవర్ కు భయపడితే, మరికొందరు వారి నెలవారి వేతనం నుంచి క్రమం తప్పకుండా అందే లంచం డబ్బులకు కామ్ అయిపోతున్నారు.

మసకబారుతున్న బల్దియా ప్రతిష్ట..

హైదారాబాద్, వరంగల్ బల్దియాల తరవాత అతిపెద్ద బల్దియాల్లో ఒకటిగా పేరున్న ఇందూర్ బల్దియా ప్రతిష్ట రోజురోజుకూ మసకబారి పోతోందని కార్పొరేషన్ లో సిన్సియర్ గా పనిచేసే సిబ్బంది ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ ను గాడిలో పెట్టాల్సిన కమిషనర్ ఎవరొచ్చినా పొలిటికల్ ఒత్తిళ్లతో ఇబ్బందులు పెడుతున్నారని చెపుతున్నారు. కార్పొరేషన్ లోని ఏ విభాగంలో కూడా అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ గా ఉండకుండా పోలికల్ పవర్ తో తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెపుతున్నారు. ఎంత అధికారులమైనా తెలిసో, తెలియకో మాతో కూడా చిన్న తప్పులు జరుగుతాయని, వాటినే వెతికి పట్టి బెదిరిస్తూ వారికి కావాల్సిన పనులు మాతో చెయించుకుంటున్నారని చెపుతున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ గా అప్డేట్ కాక ముందు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. అన్న చందంగా బల్దియా భ్రష్టు పట్టిపోయిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జోక్యం ఎక్కువైందని ఏ కమిషనర్ వచ్చినా మార్చలేరేమో అనిపిస్తోందని నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు.

పారిశుద్ధ్య విభాగంలో అవినీతి 'కంపు'..

బల్దియాలో పారిశుద్ధ్య విభాగం ప్రధానమైన విభాగం. ఈ విభాగంలో పనిచేసే ప్రతి సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేస్తే నగరమంతా క్లీన్ గా ఉంటుంది. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, రోడ్లను ఊడ్చటం, చెత్తను తరలించి డంప్ యార్డుకు తరలించడం వంటి పనులన్నీ పారిశుద్ధ్య సిబ్బందే చేస్తారు. శానిటేషన్ విభాగంలో మాత్రం శానిటరీ ఇన్ స్పెక్టర్ కింగ్ లుగా చలామణి అవుతున్నారు.. బల్దియాలో మేమే కింగులం..

అంతా మా ఇష్టం.. అంటున్నారు..

కమిషనర్ కార్యాలయంలో కూర్చుని ఫైళ్లు చూసుకోవడానికే టైం లేనంతగా కమిషనర్ కష్టపడుతుంటే పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న లీలలు ఆయనేం చూస్తాడులే అంటూ అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు.. కమిషనర్ మా కాడికి యాడొస్తడు.. మమ్మల్ని ఏం చూస్తాడనే తలబిరుసు ధీమాతో శానిటరీ ఇన్ స్పెక్టర్లు రెచ్చిపోతున్నారు.

లైంగిక వేధింపులు పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కొందరు మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు కార్మికులు వేధింపులు తట్టుకోలేక లొంగిపోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కార్పొరేషన్ కు కొత్తగా వచ్చిన కమిషనర్ దిలీప్ కుమార్ ఛార్జీ తీసుకున్న నుంచి సమగ్ర కుటుంబ సర్వే రావడం, తరచూ ఉన్నతాధికారులతో సమీక్షలు వంటి వాటితోనే కమిషనర్ బిజీగా ఉండటంతో ఏ విభాగంలో ఏం జరుగుతోందనే విషయాలపై దృష్టి సారించేంత టైం లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ లోని ప్రతి వ్యవస్థను, విభాగాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ పై ఉంది.

కార్పొరేషన్ లో జరుగుతున్న విషయాలపై త్వరలోనే సమీక్షిస్తాం : దిలీప్ కుమార్, కమిషనర్

నేను చార్జీ తీసుకున్నప్పటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, ప్రభుత్వ కార్యక్రమాల్లోనే బిజీగా ఉండటమవుతోంది. సర్వే పూర్తయిన వెంటనే కార్పొరేషన్ లోని అన్ని విభాగాల పనితీరును పరిశీలిస్తా.. ఈ విషయాలపై తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తా.

Advertisement

Next Story