పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహనను పెంపొందించాలి

by Sridhar Babu |
పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహనను పెంపొందించాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : సంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్తకళాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన(పథకం) పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను వివరిస్తూ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. కమ్మరులు, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, చేతి వృత్తుల వారు, హస్తకళాకారులు వంటి 18 కేటగిరీలలో పని చేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అన్నారు. వడ్రంగులు, పడవల తయారీదారులు, కమ్మరులు, తాళాల తయారీదారులు, బంగారం, వెండి ఆభరణాల పని చేసేవారు, శిల్పులు, చర్మకారులు, తాపీ పనివారు, చీపురు తయారీదారులు, రజకులు, దుస్తులు కుట్టే దర్జీలు, చేపల వలలు తయారుచేసే వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా స్వయం ఉపాధి ఏర్పర్చుకోవాలనుకునే చేతివృత్తిదారులు, హస్త కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు.

చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. పీ ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 7 రోజుల నుండి 15 రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా టూల్ కిట్ కోసం 15000 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తారని తెలిపారు. లబ్దిదారులు నామమాత్రంగా కేవలం ఐదు శాతం వడ్డీపై రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. విశ్వకర్మలు తయారుచేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని అన్నారు.

ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పీఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా చొరవ చూపాలని, సీఎస్సీకేంద్రాల ఆపరేటర్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు కలెక్టర్ హితవు పలికారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అయితే గత 5 ఏళ్లలో స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు తీసున్న వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు.

ముద్ర, స్వనిధి పథకాల లబ్ధిదారులు తమ రుణాలను చెల్లిస్తే ఈ విశ్వకర్మ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికి, కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదన్నారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎంఎస్ఎంఈ అధికారి రాజేష్ యాదవ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, ఎస్.సిద్దయ్య, పంచాయతీల కార్యదర్శులు, సీఎస్సీ ఆపరేటర్లు, ఔత్సాహిక విశ్వకర్మలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed