ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

by Sridhar Babu |   ( Updated:2024-02-17 11:28:33.0  )
ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకట రమణ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు.

ఇంటర్ పరీక్షలకు 35346 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పదవ తరగతి పరీక్షలకు 22274 మంది విద్యార్థులకు గాను 143 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్ఎం కె.జాన్ రెడ్డికి సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు.

నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో డీఐఈఓ రఘురాజ్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్.ఎం కె.జాన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story