అలీసాగర్ ఆయకట్టుకు ఎత్తిపోతల పథకం జలాలు

by Sridhar Babu |
అలీసాగర్ ఆయకట్టుకు ఎత్తిపోతల పథకం జలాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగు జలాలు అందించేందుకు వీలుగా శుక్రవారం ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి నవీపేట మండలం కోస్లీ వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లకు పూజలు నిర్వహించి స్విచాన్ చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. గోదావరిలో ఇంటెక్ వెల్ వద్ద నీటి నిల్వలను, పంప్ హౌస్ లోని మోటార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున, రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. పంటలకు అవసరం ఉన్నంత వరకే నీటిని వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వృథా చేయకూడదని హితవు పలికారు.

రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పంప్ హౌస్ ప్రాంగణంలో రైతులతో ఎమ్మెల్యే భేటీ అయిన సందర్భంగా పలువురు పంట రుణాల మాఫీ అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ అర్హులైన ప్రతి రైతుకు రూ. రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల రుణమాఫీ జరగని రైతుల నుండి అధికారులు అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, రుణమాఫీ కానీ రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. తప్పనిసరిగా అర్జీలను పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి అర్హులందరికీ పంట రుణాలు మాఫీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కాగా పలు సహకార సంఘాలలో పంట రుణాల మాఫీలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. అక్రమాలు వాస్తవమని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి వాటిలోని కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారని, దీనివల్ల పంపుసెట్లు పనిచేయక రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున ట్రాన్స్ఫార్మర్స్ చోరీలను నిలువరించేందుకు గట్టి నిఘా ఉంచాలని ట్రాన్స్కో, పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నీటి పారుదల శాఖ ఎస్.ఈ గంగాధర్, ఏఈ ప్రణయ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, ఆయా శాఖల అధికారులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed