జీవధాన్ ఘటన బాధాకరం.. షబ్బీర్ అలీ

by Sumithra |
జీవధాన్ ఘటన బాధాకరం.. షబ్బీర్ అలీ
X

దిశ, కామారెడ్డి : జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. జీవధాన్ పాఠశాలలో ఆరేళ్ళ చిన్నారి పై పీఈటీ వికృత చేష్టల విషయం మీడియా ద్వారా తనకు తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసుల పై రాళ్లదాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్సై రాజారాం, హజారుద్దీన్ లకు గాయాలయ్యాయని, మరొక హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగిందన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, ఐజీలను కోరారు.

అమాయక యువకుల పై కేసులు నమోదు చేయొద్దని, అలా చేస్తే భవిష్యత్తులో వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. పాఠశాలలో ఆందోళన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సూచన మేరకు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. కామారెడ్డి శాంతియుతంగా ఉందని, ఇది కమ్యూనల్ ఇష్యు కాదన్నారు. ఇలాంటి వార్తల సేకరణలో మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఘటనకు సంబంధించి కొన్ని ఛానళ్లలో అత్యాచారం జరిగిందని, మరికొన్ని ఛానళ్లలో అత్యాచారయత్నం అని వివిధ రకాలుగా వచ్చిందని, ప్రజలు దేనిని నమ్మాలన్నారు. వార్తల సేకరణలో తొందరపాటు జరగకుండా చూడాలని కోరారు. కామారెడ్డి భవిష్యత్తుకు సహకరించాలన్నారు.

మంత్రి పదవి అధిష్టానం నిర్ణయం..

మంత్రివర్గంలో చోటు అనేది అధిష్టానం నిర్ణయమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. దసరా తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం పై మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. మంత్రి పదవి పై ఆశ లేదన్నారు. తాను పదేళ్లు మంత్రిగా ఉన్నానని, ఐదేళ్లు మండలి నాయకునిగా ఉన్నానని తెలిపారు. పదవులు తనకు కొత్త కాదని, మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు.

కేటీఆర్, హరీష్ రావులకు బుద్దుండాలి..

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కాస్తయినా బుద్ధి ఉండాలని షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన ఓట్లు రాకపోవడం వల్లనే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై షబ్బీర్ అలీ స్పందన కోరగా పై విధంగా స్పందించారు. మల్లన్నసాగర్, గజ్వేల్ ముంపు భూముల పై తాము అడగడానికి వెళ్తే మధ్యలోనే తమను అడ్డగించి మూడుగంటలు అటూ ఇటూ తిప్పి 12 గంటల పాటు అరెస్ట్ చేశారన్నారు. కాళేశ్వరం పై కమిషన్ కు ఇంజనీర్లు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. హైడ్రా ద్వారా పేదల ఇళ్లను కూల్చబోమని, అక్రమ కట్టడాలను మాత్రమే కూలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవాటిని మాత్రమే కూలుస్తున్నారని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావులు జోకర్లని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed