విశ్వమోహన కాశీ.. హిందూ ముస్లిం సంస్కృతికి కాశీనగరం

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-30 11:48:03.0  )
విశ్వమోహన కాశీ.. హిందూ ముస్లిం సంస్కృతికి కాశీనగరం
X

హైందవ సంస్కృతికి ఆలవాలంగా పేరుపడిన కాశీనగరంలో హిందూ ముస్లిం సంస్కృతి కనిపించడం విశేషం. ప్రసిద్ధమైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకొని మసీదు కూడా ఉంటోంది. పాత కాశీనగరమంతా మన హైదరాబాదు పాత బస్తీని తలపిస్తుంది. అక్కడి ఇరుకైన సందుల్లో నడవడం వల్లనే అక్కడి జీవన విధానాన్ని స్పష్టంగా చూడవచ్చు. అర్థరాత్రి కూడా టీకొట్టులు, పూజా సామగ్రి కొట్టులు తెరచి ఉండటం చూస్తే కాశీ నగరం అసలు నిద్ర పోతుందా! అనే సందేహం కలుగుతుంది. చాలా మందే బతకడానికి కాశీకి వచ్చినట్లు బోధపడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈతి బాధలు భరించలేక బతుకు తెరువు వెతుక్కుంటూ కాశీకి తెలుగువారు వస్తుంటారు. అక్కడ తెలుగువారితో పరచయం కాగానే నాకు " A Journey To the Kashi " సినిమా గుర్తొచ్చింది. గంగానది చుట్టూ 64 సుప్రసిద్ధ ఘాట్‌లు, నిత్యం జరిగే శవ దహన సంస్కారాలు, బనారస్ సిల్క్ పేరిట కుటీర పరిశ్రమగా ఎదిగిన పట్టువస్త్రాల నేత పరిశ్రమ, వేలాది దేశీయ, విదేశీ విద్యార్థులు చదువుకుంటున్న బనారస్ విశ్వవిద్యాలయం, దేశ విదేశాల నుంచి ఏడాది పొడవునా వస్తున్న పర్యాటకులు.. మొత్తం మీద కాశీ నగరం ప్రాచీన, ఆధునిక సంస్కృతుల కలబోతగా ఆకట్టుకుంటుంది.

శ్రీనాథుడు రాసిన కాశీఖండంలోని వ్యాసుని కోప ఘట్టం పాఠాన్ని పదో తరగతి విద్యార్థులకు దాదాపు పదేళ్ళు బోధించాను. కాశీ వీధుల్లో భిక్ష లభించని వ్యాసుడు కాశీనగరాన్ని శపించబోతాడు. కాశీ అన్నపూర్ణ ఆయన ఆకలిని తీర్చడంతో కథ సుఖాంతమవుతుంది. ఆ సందర్భంలో..... కాశీనగరం ఎలా ఉంటుంది? ముఖ్యంగా వీధులు, అక్కడి సంస్కృతి, జీవన విధానాన్ని పరిశీలించాలనే కోరిక బలంగా కలిగింది. అది ఇప్పటికి తీరింది.

పాత బస్తీని తలపించే పాత కాశీనగరం

భారతదేశంలో కాశీ అతి పురాతనమైన నగరం. ముఖ్యంగా హైందవ సంస్కృతికి ఆలవాలంగా పేరుపడ్డది. కానీ నాకు మాత్రం నగరంలో హిందూ ముస్లిం సంస్కృతి కనిపించింది. ప్రసిద్ధమైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకొని మసీదు కూడా ఉండడం దీనికి తార్కాణం. పాత కాశీనగరమంతా మన హైదరాబాదు పాత బస్తీని తలపించింది. ఆ ఇరుకైన సందుల్లో నడవడం వల్లనే నేను అక్కడి జీవన విధానాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఎయర్ పోర్టు నుంచి వచ్చిన మా టాక్సీ మేము బుక్ చేసుకున్న వసతి గృహానికి చాలా దూరంలో ఆగిపోయింది. కారణం ఆ చిన్న చిన్న సందుల్లోకి పోదని డ్రైవరు చెప్పడంతో అర్ధరాత్రి లగేజీ మోసుకుంటూ నడక మొదలు పెట్టాము. ఐదారు సందులు తిరిగిన తరువాత మేము ఏర్పాటు చేసుకున్న వసతిగృహానికి చేరుకున్నాము.

కాశీ నగరం నిద్రపోతుందా?

ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న స్పర్శ దర్శనానికి అర్థరాత్రి ఒంటిగంటకు మేము ఆ ప్రదేశానికి చేరుకునేసరికే చాంతాడంత లైను చూసి ఆశ్చర్యపోయాను. అప్పటికే అక్కడ టీకొట్టులు, పూజా సామగ్రి కొట్టులు తెరచి ఉన్నాయి. కాశీ నగరం అసలు నిద్ర పోతుందా! అనే సందేహం కలిగింది. కొంతమంది సాధువులు అటూ ఇటూ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు. వారిలో హిందీలో తెలుగులో మృదుమధురంగా పాటలు పాడుతున్న ఒకతను నన్ను ఆకర్షించాడు. అతనితో మాట కలిపాను. పేరు చంద్రయ్య. గత ముప్పై సంవత్సరాలు కాశీలోనే ఉంటున్నాడు. ఈతి బాధలు భరించలేక బతుకు తెరువు వెతుక్కుంటూ కాశీకి వచ్చాడట. నాకు వెంటనే " A Journey To the Kashi " సినిమా గుర్తొచ్చింది. అందులో హీరో అలానే కాశీకి వస్తాడు. కాసేపటికి చంద్రయ్య కొత్త చొక్కాతో కనిపించాడు. రేటు టాగ్ కూడా తీయకుండా..... అంటే ఆయన పాటలు పాడితే ఇచ్చిన డబ్బుతో అప్పటికప్పుడు కొత్తచొక్కా కొనుక్కొని వేసుకున్నాడున్నమాట. మళ్ళీ ఆశ్చర్యంతో ఆయనను అడిగాను. " ఏదీ శాశ్వతం కాదు, ఉన్నప్పుడే అనుభవించు, అన్నాడమ్మ శివుడు " ఆయన బదులిచ్చిన పద్ధతికి మరోమారు ఆశ్చర్యపోవడం నా వంతైంది.

తెలుగు ప్రజల నిలయం కాశీ

అక్కడ ఉన్న రెండు రోజుల్లో చాల మందే బతకడానికి కాశీకి వచ్చినట్లు గమనించాను. ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణా జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కారణాలు వేరువేరుగా ఉన్నాయి. అలా వచ్చిన వాళ్ళలో శ్రాద్ధకర్మ కాండలు నిర్వహించే బ్రాహ్మణులు ఎక్కువమంది ఉన్నారు. కాశీ నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పటికీ భాషా సమస్య ఏమాత్రం లేదు. తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ స్థిరపడ్డారు. ఉదయమే కాఫీ తాగుతూ కొట్టు యజమాని ముఖేశ్‌తో మాటకలిసాను. అతడు స్థానికుడు. గంగానది తీరంలో రాత్రుళ్లు తాము కుటుంబాలతో ఆనందంగా గడిపే వాళ్ళమని, ఇప్పుడు అలా కుటుంబాలతో వెళ్ళే పరిస్థితులు లేవని, ఆ స్థానంలో గానా, పీనా, నాచ్ నా సంస్కృతి వచ్చిందని, అదే అభివృద్ధి అని వాపోయాడు.

వందలాదిమంది సామూహిక అభిషేకాలు

సుమారు ఎనభై మందికి ఏక కాలంలో (online‌లో బుక్ చేసుకున్న వాళ్ళకు) రుద్రాభిషేకం చేయించిన తెలుగు పురోహితుడు ఆదిత్యను ఆ కార్యక్రమం తరువాత పలుకరించాను. ఆలయం చుట్టూ ఉన్న వసారా మండపం ఈ మధ్య కాలంలో నిర్మించారట. ఒకేసారి వందలాది మంది అభిషేకాలు చేసుకోవడానికి ఆ ప్రాంతం వీలుగా ఉన్నది. దాని ఉద్దేశం కూడా అదే కాబోలు. ప్రధాన ఆలయ గోపురం బంగారంతో మిలమిలా మెరుస్తుంది. ఎవరో అజ్ఞాత వ్యక్తి దానం చేసిన అరవై కిలోల బంగారంతో ఇటీవలే ఆ సువర్ణ గోపుర శిఖరాన్ని అమర్చినట్లు తెలిసింది. కాశీలో చిన్నా పెద్దా ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ప్రధాన విశ్వనాథ ఆలయంతోపాటు అన్నపూర్ణ, విశాలాక్షి, వారాహి కాల భైరవ, మృత్యుంజయ, వినాయక, హనుమాన్, దుర్గ, గవ్వలమ్మ, యూనివర్శిటీ ప్రాంగణంలో ఉన్న బిర్లామందిర్.

గంగానది చుట్టూ 64 ఘాట్‌లు

కాశీనగరం అనగానే మనకు స్ఫురించే మరో అద్భుతమైన జ్ఞాపకం గంగానది. దాని చుట్టూ ఏర్పాటైన 64 ఘాట్ లు. వాటిలో నిత్యం గంగాహారతి కొనసాగే ఐదు ఘాట్ లు. అందులో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ లు మరీ ప్రధానమైనవి అంటారు. గంగానది నిండుగా పోటుమీద ఉండడం వలన పడవ ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించారు. అందువల్ల పడవలో ప్రయాణిస్తూ 64 ఘాట్ లు చూసే అవకాశం లేకపోయింది. హారతి కార్యక్రమం కూడా నేను ఊహించుకున్నంత గొప్పగా లేదు. కారణం నీళ్ళు పైదాకా ఉండడం. స్థలాభావం వలన ముగ్గురు పండితులు మాత్రమే హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని తిలకించడానికి విదేశీయులు సైతం ఉత్సాహపడ్డారు. మేము అస్సీ ఘాట్ నుంచి ఈ వేడుకను చూసాము. తులసీదాస్ ఈ ఘాట్ లోనే రామ్ చరిత్ మానస్ రాశాడని చెపుతారు.

నిరంతరం శవదహన సంస్కారాలు

నా ప్రయాణ ప్రణాళికలో ముఖ్యంగా నేను చూడాలనుకున్నవి రెండు. ఒకటి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, నిరంతరం శవదహన సంస్కారాలు జరిగే హరిశ్చంద్ర ఘాట్ కు వెళ్ళడం రెండోది. నేను అక్కడకు వెళ్ళినప్పుడు ఒక శవం కాలుతూ ఉంది. నేను ఉన్న పదినిమిషాలలో మూడు శవాలు వచ్చాయి. శవాలు కాలే ప్రదేశానికి ఆనుకొని వాళ్ళు నివసిస్తున్న చిన్న బస్తీ ఉంది. అక్కడే చిన్న పిల్లలు నిర్భయంగా ఆడుకుంటున్నారు. అక్కడి శవదహన సంస్కారాలు ఆ పిల్లల జీవన ఎదుగుదలలో ఒక భాగం. దాదాపు రెండువందల మంది ఆ వృత్తిలో ఉన్నారట ..... ఆ ఘాట్ కు రోజుకు సుమారు 20, 30 శవాలు వస్తాయట. ఒక్క శవ దహన సంస్కారానికి ఎనిమిది వేలు చెల్లిస్తారు. వాళ్ళకు వచ్చేది రోజుకు సగటున 1500 నుంచి 2000 వేలు మాత్రమే.... ఇక్కడ కూడా మధ్య దళారులు ఉండడం శోచనీయం. చౌదరి కులస్థులు ఈ వృత్తిని చేస్తున్నారు అక్కడ అది దళిత వర్గం లోకి వస్తుంది కాబోలు.

బనారస్ వర్సిటీలో వేలాది విద్యార్థులు

భారతదేశంలో మొదటిది బనారస్ హిందూవిశ్వవిద్యాలయం. డా. అనిబిసెంట్, మదన్ మోహన్ మాలవ్యాల చొరవతో 1916లో స్థాపించబడింది. సామాజిక శాస్త్రాలు, భాషలు, సైన్సు, సాంకేతిక, కళా రంగాలకు సంబంధించిన శాఖలు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వేలాదిగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ప్రత్యేకించి విదేశీ విద్యార్థులు ఈ వర్సిటీలో పెద్ద సంఖ్యలో చేరటం మరీ విశేషం. ఈ ప్రాంగణంలో బిర్లామందిర్ కూడా ఉంది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల చిత్రకళా శాఖకు చెందిన కొందరు విద్యార్థులు తాము చిత్రించిన చిత్తరువులను అమ్మకానికి పెట్టారు. అలా తరచుగా అమ్మకం ఉంటుందని చిత్రకళ పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ విద్యార్థిని ఆకృతి అగర్వాల్ చెప్పింది.

ఒక మోస్తరుగానే వసతులు

గంగానది సమీపంలోనే ఉన్నా నగరమంతటా నీటి సరఫరా లేదని, చాలా చోట్ల బోరుబావులనుండి నీటి సరఫరా జరుగుతుందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. పట్టువస్త్రాల నేత పరిశ్రమ బనారస్ లో పెద్ద కుటీర పరిశ్రమగా ఉంది. బనారస్ సిల్క్ చాలా ప్రసిద్ధి పొందింది. నేతవారిలో ఎక్కువగా మోమిన్ అంసారి అనే ముస్లింలు ఉన్నారు. ఈ పనిలో ఎక్కువగా పిల్లలే ఉండడం విచారకరం. తివాచీ, రగ్గులు, ఇత్తడి, రాగి లోహపు బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పర్యాటకం కూడా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాలనుంచి ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తూనే ఉంటారు. వసతులు ఒకమోస్తరుగా ఉంటాయి. శుభ్రతను పాటించి వసతులను కొంత మెరుగుపరిస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

గిరిజ పైడిమర్రి

99494 43414

Advertisement

Next Story

Most Viewed