నిన్నటి నుంచి భోజనం కూడా చేయలేదు.. గాంధీభవన్‌లో కన్నీరు పెట్టిన మంత్రి కొండా సురేఖ

by Gantepaka Srikanth |
నిన్నటి నుంచి భోజనం కూడా చేయలేదు.. గాంధీభవన్‌లో కన్నీరు పెట్టిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పందించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా మంత్రిని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సమంజసం కాదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారని అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి ట్రోలింగ్, వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

ఇప్పుడే కాదని.. మొదటి నుంచి కూడా కేసీఆర్ మహిళలను దారుణంగా అవమానిస్తూనే వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని కూడా అవమానించారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు కేటీఆర్, బీఆర్ఎస్ చేసిందేమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం.. కానీ, ఒక మహిళను నేరుగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా అవమానించడం సరికాదని హితవు పలికారు. ట్రోలింగ్ వల్ల నిన్నటి నుంచి తాను భోజనం కూడా చేయలేదని ఆవేదన చెందారు. దండ వేసినంత మాత్రాన ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.

కాగా, ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలుకుతూ రఘునందన్ రావు ఆమె మెడలో పూలదండ వేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బీఆఎస్ నేతలు ట్రోల్స్ చేశారు. తాజాగా.. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన కొండా సురేఖ.. బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed