Actor Siddique: మలయాళ నటుడు సిద్ధిఖీకి సుప్రీంకోర్టులో ఊరట

by Shamantha N |
Actor Siddique: మలయాళ నటుడు సిద్ధిఖీకి సుప్రీంకోర్టులో ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్ధిఖీ (Actor Siddique)కి ఊరట దక్కింది. నటిపై లైంగిక వేధింపుల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అతడికి అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ కోసం పోలీసుల ముందు హాజరుకావాలని, విచారణకు సహకరించాలని సూచించింది. అలానే, కేరళ ప్రభుత్వానికి, నటికి నోటీసులు జారీ చేసింది.

హేమ కమిటీ నివేదిక

మల‌యాళ చిత్ర ప‌రిశ్రమ‌లోని మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న వేధింపుల‌పై కేర‌ళ ప్రభుత్వం జస్టిస్‌ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేసింది. కాగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ లో సంచలనాలు బయటకొచ్చాయి. న‌టుడు సిద్ధిఖీపై ఓ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ ఆరోప‌ణ‌లు మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసుల్లోనే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సరైన దర్యాప్తు జరిగేందుకు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోర్టు తీర్పుతో సిద్ధిఖీని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసి లుక్‌అవుట్‌ నోటీసులు ఇష్యూ చేశారు. దీంతో, నటుడు సిద్ధిఖీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కాగా.. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.

Advertisement

Next Story

Most Viewed