తెలంగాణలో కారు టైర్ పంక్చర్ కాబోతుంది

by Sridhar Babu |
తెలంగాణలో కారు టైర్ పంక్చర్ కాబోతుంది
X

దిశ ప్రతినిది, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తుందని, త్వరలో రాష్ట్రంలో కారు టైర్ పంక్చర్ కాబోతుందని జాతీయ కాంగ్రెస్ మీడియా ఇంచార్జి, ఎంపీ జైరాం రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని, అదే జోష్ లో కర్ణాటకలో విజయం సాధించామన్నారు. తెలంగాణలోనూ ఆశించినంతగా అభివృద్ది జరగలేదని, కేవలం బీఆర్ఎస్ పార్టీ హైద్రాబాద్ పైనే దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కానీ పదేళ్ల పాలనలో ప్రజాపాలన కంటే కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ ప్యామిలీ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ మినహా పెట్టుబడులు రాలేదని, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు వైపులా బొమ్మలు లాంటివని కానీ దానికి మూడవ మొహంగా ఎంఐఎం ఉందన్న విషయాన్ని మరువరాదన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయితే, ఎంఐఎం సీ టీం అన్నారు. ప్రస్తుతం జరిగేవి తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. కాంగ్రెస్ ను గెలిపించండి, ప్రజల తెలంగాణను నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీ స్కీంలు పెట్టిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేస్తున్న స్కీంలపై అనుమానాలు ఉంటే అక్కడికి వెళ్లి చూడొచ్చన్నారు. దేశంలో మతకల్లోలాలు, సాంప్రదాయాల పేరుతో పని చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 70కి తక్కువ కాకుండా సీట్లు గెలుస్తున్నామన్నారు. కాంగ్రెస్ గాలి వీస్తుందని , ఒకప్పటి కాంగ్రెస్ కాదని ఇప్పటి వరకు కాంగ్రెస్ వీడిన వారంతా వెనక్కి వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరగడం ఖాయమని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ పరిశీలకులు ఏబీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed