పెట్టుబడి సాయానికి ఎదురు చూపులు..

by Sumithra |   ( Updated:2025-01-04 07:33:55.0  )
పెట్టుబడి సాయానికి ఎదురు చూపులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతుబంధు డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు కొందరికి మాత్రమే పెట్టుబడి సాయం అందింది. ఇంకా చాలా మందికి ఈ డబ్బులు రాలేదు. దీంతో వారంతా ఇప్పుడు రైతుబంధు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సీజన్‌ పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.10 వేల సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నగదు బదిలీని ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం, ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి నిధులు సమకూరక పోవడంతో ఈ పథకం ముందుకు సాగడం లేదు. విస్తీర్ణంలో భూమి ఉంటే అంత భూమికి ప్రతిఏటా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం రైతులకు అందింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో అనేక అవకతవకలు జరిగాయని, రాళ్లు రప్పలు, గుట్టల భూములకు కూడా పెట్టుబడి సాయం పేరిట రూ. వేలాది కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పథకాన్ని ప్రక్షాళన చేసి రైతు భరోసా పేరుతో పంటలు సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని, ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పంటలు సాగుచేసే రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందిస్తామని మంత్రి వర్గ సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఓ పక్క పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చేస్తూనే, మరో పక్క ఈనెల 14 నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని చెపుతోంది. ప్రభుత్వం ఈ నిధులు ఎవరి ఖాతాలో జమ చేస్తుందో.. ఎవరికి మొండిచేయి చూపుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు మూడ్రోజులుగా ఎక్కడ నలుగురు రైతులు కలిసిన పెట్టుబడి సాయం రైతు భరోసా పైనే చర్చించుకుంటున్నారు. పంటలు సాగుచేసే రైతులు తమకు పెట్టుబడి సాయం కచ్చితంగా వస్తుందనే ధీమాతో ఉన్నప్పటికీ, పంటలు సాగు చేయలేకపోతున్న రైతులు మాత్రం ప్రభుత్వం నిర్ణయంతో పరేషాన్ అవుతున్నారు.

డిజిటల్ సర్వేనా.. రిమోట్ సెన్సింగ్ తోనా..

పంటల సాగును నిర్ధారించే సర్వేను డిజిటల్ పద్ధతిలో చేస్తారా.. లేదంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా నిర్దారిస్తారా అనే విషయంలో ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడంతో వ్యవసాయ అధికారులు కూడా ఎటూ తేల్చలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన గైడ్ లైన్స్ వస్తే తప్ప ఏదీ చెప్పలేమని చెపుతున్నారు.

రైతు భరోసా కోసం దరఖాస్తు పై స్పష్టత లేదు..

ఇది వరకే రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందుకుంటున్న రైతులు కొత్తగా రైతు భరోసా కోసం అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్త రైతులు మాత్రం అప్లయ్ చేసుకోవాలని గ్రామస్థాయిలో ఏఈఓలు రైతులకు చెపుతున్నారు. కొందరు మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అన్ని విషయాల పై గైడ్‌ లైన్స్ వస్తే తప్ప ఏ విషయాన్ని అధికారికంగా చెప్పలేమని కూడా చెపుతున్నారు. ఒక వేళ రైతుభరోసాకు అప్లయ్ చేసుకోవాల్సి వచ్చినా ఏఈఓల స్థాయిలోనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు రైతుబంధు అందుకుంటున్న వారిలో పంటలు సాగు చేస్తున్న రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

ఈ నెల 5 నుంచి 8 వరకు పంటల సాగు సర్వే..

పంటల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు మండల వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)కు ఆదేశించినట్లు తెలుస్తోంది. పంటల నమోదు మ్యానువల్ గా చేయాలా ? డిజిటల్ సర్వే ద్వారా గుర్తించి చేయాలా ? అనే విషయాల పై ఏఈఓలకు ఉన్నతాధికారులు స్పష్టమైన సూచనలేవీ చేయలేదు. పంటల నమోదు కోసం సర్వే మాత్రం జరుగుతుందని తెలుస్తోంది. ఎలా నమోదు చేయాలన్న విషయంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు చెపుతున్నారు.

గత రెండు సీజన్లలో నిజామాబాద్ జిల్లాలో రైతులకు అందిన పెట్టుబడి సాయం..

జిల్లాలో రైతులకు ప్రభుత్వం గత యాసంగి, వానాకాలం రెండు సీజన్ లో కలిపి రూ. 543.26 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. 2023 -24 యాసంగి సీజన్ లో 2,73, 595 మంది రైతులకు రూ.271.44కోట్లు, 2023 వానాకాలం సీజన్ లో 2,71,482 మందికి రూ. 271.82 కోట్లు నిధులను పంపిణీ చేసింది. పంటల సాగుతో సంబంధం లేకుండా పంపిణీ చేసిన పెట్టుబడి సాయం ఇలా ఉంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం ఇస్తే ఎంత మేర తగ్గుతుందనే విషయాన్ని వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed