పాఠశాలల పురోభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగ‌స్వాములు కావాలి

by Naveena |
పాఠశాలల పురోభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగ‌స్వాములు కావాలి
X

దిశ,కొల్లాపూర్: పిల్లలకు కుటుంబమే మొదటి బడని,తల్లిదండ్రులే తొలి గురువులని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందుకే తల్లిదండ్రులు త‌మ‌ పిల్ల‌ల‌ విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు. కొల్లాపూర్ మండలం సింగోటంలో రూ. 70.80 ల‌క్ష‌ల ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల‌తో ఆధునీక‌రించిన ప్రాథ‌మిక‌, జ‌డ్పీహెచ్ఎస్ భ‌వ‌నాల‌ను సోమవారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంత‌రం పాఠ‌శాల ప్రాంగ‌ణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల‌తో ఏర్పాటు చేసిన‌ చ‌ర్చిద్దాం.. విద్యార్థుల భ‌విష్య‌త్ కార్యక్రమంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో ముఖాముఖి నిర్వహించారు. పిల్ల‌ల‌ ఉన్న‌త చ‌దువులు, వారి భ‌విష్య‌త్ కోసం ప్ర‌భుత్వం ప‌రంగా చేయాల్సింది ఎంటీ?, మీరేం చేయాలో స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను కోరారు. విద్యార్థులో మంత్రి ముచ్చ‌టించారు. త్రిభుజ, వృత్త వైశాల్యాన్ని ఎట్లా కొలుస్తార‌ని విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ పాఠశాల్లో నాణ్య‌మైన విద్యా బోధ‌న అందిస్తామ‌ని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. క్రీడ‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. తల్లిదండ్రుల స‌హకారంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చాల‌నే ల‌క్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 10 కోట్ల ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల్లో రూ. 8 కోట్లు విద్యాభివృద్ధికే కేటాయించిన‌ట్లు తెలిపారు. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే విద్యార్థులకు చిన్ననాటి నుంచే విలువలతో కూడిన విద్య అందించాలని మంత్రి తెలిపారు. అందుకు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని ప్రతి విద్యార్థి చదువు పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

ప్ర‌స్తుత స‌మాజంలో ఎన్నో పెడ‌ధోర‌ణుల‌ను చూస్తున్నామని, వీట‌న్నింటికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మ‌న సంస్కృతి ధ్వంసం కావడం, విలువ‌లు న‌శించ‌డ‌మే అని అన్నారు. భార‌తదేశ సంస్కృతి, సాంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని, చ‌దువుతో పాటు విద్యార్థుల‌కు సంస్కారం, న‌డ‌వ‌డిక కూడా నేర్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. అంద‌రి ఆలోచ‌న ధోర‌ణులు మారాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతో ఉంద‌ని ఉద్ఘాటించారు. స‌మ‌య‌పాల‌న‌, స‌రియైన ప్ర‌ణాళిక‌ల‌తో చ‌దువుల్లో విద్యార్థులు రాణించాల‌ని సూచించారు. సాంకేతిక‌త‌ను స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో వినియోగించుకోవాల‌ని కోరారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు ఆంగ్ల దినపత్రికలకై తక్షణమే దినపత్రికలు తెప్పించేలా మంత్రి పదివేల రూపాయలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల దినపత్రికలతో పాటు డిక్షనరీలను అందించేందుకు మంత్రి నిధుల నుండి ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు సూచించారు. గ్రామ మాజీ సర్పంచ్ ఇమ్మిడిశెట్టి వెంకటస్వామి అభ్యర్థన మేరకు సింగోటం గ్రామంలో ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిఎస్ఆర్ నిధుల నుండి ఒక కోటి రూపాయలను మంజూరు చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. తద్వారా విద్యుత్ ఇంటి అవసరాలతో పాటు ప్రతి నెల ప్రతి ఇంటికి రూ,3 వేలు ఆదాయం కూడా సమకూరుతుందని, 3కేవి సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్లకి కావలసిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ..సింగోటం ఉన్నత పాఠశాలను తాను గతంలో సందర్శించినప్పుడు అనేక సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు గారి కృషితో పాఠశాలలకు గదుల నిర్మాణంతో పాటు ప్రాంగణం ఎంతో అభివృద్ధి చెందిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, తల్లిదండ్రులు కూడా ప్రతి మూడో శనివారం పాఠశాలలో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశానికి హాజరై విద్యార్థుల విద్య బోధన ప్రమాణాలను పరిశీలించాలని, పాఠశాలలను అప్పుడప్పుడు సందర్శించి ఉపాధ్యాయుల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్య దొరుకుతుందని, అందుకు అనుగుణంగానే జిల్లా మంత్రి విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రతి సమావేశంలో విద్య పైనే మంత్రి దృష్టి కేంద్రీకరించారని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత నుండి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా విద్యను అభ్యసించేందుకు కృషి చేయాలని, విద్యతోటే సమాజంలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, పి ఆర్ ఈ ఈ శ్రీనివాస్, ఆర్డిఓ బన్సీ లాల్, తహసిల్దార్ విష్ణువర్ధన్ రావు, సింగోటం మాజీ సర్పంచ్లు ఇమ్మిడిశెట్టి వెంకటస్వామి, ఇందిరమ్మ, వెంకటస్వామి,పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులు తత్తర పాల్గొన్నారు.

Advertisement

Next Story