Minister Ponguleti: త్వరలో “ధరణి” సమస్యలకు చరమగీతం

by Praveen Kumar Siramdas |   ( Updated:2024-08-19 14:49:35.0  )
Minister Ponguleti: త్వరలో “ధరణి” సమస్యలకు చరమగీతం
X

త్వరలో “ధరణి” సమస్యలకు చరమగీతం

– దేశానికి ఆదర్శంగా కొత్త రెవెన్యూ చట్టం

– “రెవెన్యూ” శాఖను కాపాడుకుంటాం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

– ట్రెసా ఆధ్వర్యంలో కొత్త ఆర్వోఆర్ చట్టంపై సదస్సు

దిశ, తెలంగాణ బ్యూరో:

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి, ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు భూమి చిక్కులు కూడా లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం - 2024ను తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమన్నారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై సోమవారం టూరిజం ప్లాజాలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఏర్పాటు చేసిన చర్చావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మంత్రి ప్రసంగించారు. “చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని మంత్రి అభిప్రాయపడ్డారు. సామాన్యుని నుంచి మేధావి వరకు అన్ని వర్గాల అభిప్రాయాలను తీస్కోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడంతో పాటు ఇటువంటి చర్చావేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజానీకం కోరుకున్నారో ఆ మార్పుకు ధరణి నాంది పలికింది. ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచన చేయకుండా దొరగారికి నచ్చలేదనే ఉద్ధేశ్యంతో గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఏఓ వ్యవస్థను ఉన్నపళంగా రద్దు చేసి మొత్తంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసింది. రైతులకు, ప్రజలకు రెవెన్యూ అందుబాటులో లేకుండా పోయాయి. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తాము ఇచ్చిన హామీని విశ్వసించి తెలంగాణ ప్రజానీకం మాకు అధికారం అప్పగించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం.

కంటికి రెప్పలా

రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడే విషయంలో మాకు స్పష్టత ఉందని మంత్రి అన్నారు. రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని అలాగే రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తాం. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యహరిస్తామన్నారు. త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ చర్చ కార్యక్రమాన్ని ఆద్యంతం అద్భుతంగా నిర్వహించిన ధరణి కమిటీ సభ్యులు, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచిన అంశాలను, వాటి ప్రత్యేకతలను రైతులకు, పట్టేదార్లకు చేకూరే ప్రయోజనాలను వివరించారు. గత చట్టం వల్ల రైతులకు జరిగిన నష్టాలను కొత్త చట్టం వల్ల కాలయాపన లేకుండా అందే సేవలను, ప్రతి కమతానికి భూధార్ నెంబర్ కేటాయింపు వల్ల కలిగే లాభాలను తెలిపారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం కోరడం సంతోషకరమని, అదే విధంగా నూతన చట్టం అమలుకు రెవెన్యూ అసోసియేషన్ కూడా తమ వంతు బాధ్యతగా వివిధ జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజల నుండి సలహాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొత్త చట్టంలో ఆర్డీవోకు అప్పీలేట్ అథారిటీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ స్థాయిలో రివిజన్ అథారిటీ ఉండాలని, అలాగే ఇతర శాఖలకు బదలాయించిన వీఆర్వోలను, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూలోకి తీసుకొని గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచాలని కోరారు. ఈ చర్చా కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు వెంకట ఉపేందర్ రెడ్డి, కె.చంద్రకళ, వీఆర్వో జేఏసీ నేత గోల్కొండ సతీష్ విలువైన సూచనలు అందించారు. కార్యక్రమానికి ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ లు నేతృత్వం వహించారు.

Advertisement

Next Story

Most Viewed