TSPSC పేపర్ లీకేజీ కేసులో కొత్త కోణం.. ప్రశ్నపత్రాలు అమ్మడంలో అసలు పాత్ర అతడిదే..?!

by Satheesh |
TSPSC పేపర్ లీకేజీ కేసులో కొత్త కోణం.. ప్రశ్నపత్రాలు అమ్మడంలో అసలు పాత్ర అతడిదే..?!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు వేర్వేరు వ్యక్తుల వద్దకు చేర్చడంలో రేణుక భర్త లద్యావత్ డాక్యా కీలక పాత్ర పోషించాడని సిట్ భావిస్తున్నది. అతడు ఎవరెవరికి ప్రశ్నపత్రాలు ఇచ్చాడు? గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ సైతం అతడి ద్వారానే ఇతరులకు అందాయా? అన్న కోణం సిట్ అధికారులు డాక్యా నాయక్‌ను ఒంటరిగా విచారిస్తున్నట్లు తెలిసింది.

క్వశ్చన్ పేపర్స్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, లద్యావత్ డాక్యా, కేత్లావత్ రాజేశ్వర్ నాయక్‌లను సిట్ అధికారులు ఆదివారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో సిట్ అధికారులు షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకుమార్‌ను శనివారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది.

ఒంటరిగా విచారణ

బోర్డు ఉద్యోగి ప్రవీణ్ నుంచి రేణుక ఏఈ సివిల్స్, జనరల్ నాలెడ్జి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను తీసుకుని భర్త లద్యావత్ డాక్యాకు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిని డాక్యా బావమరిది కేత్లావత్ రాజేశ్వర్ నాయక్‌కు ఇచ్చాడు. రాజేశ్వర్ నాయక్ ఈ ప్రశ్నపత్రాలను నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లకు అమ్మాడు. షాద్‌నగర్‌కు చెందిన తిరుపతయ్య ఇవే ప్రశ్నపత్రాలను డాక్యా నుంచి తీసుకుని రాజేంద్రకుమార్‌తో రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని విక్రయించాడు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రశ్నపత్రాలు డాక్యా ద్వారానే ఇతరుల చేతికి వెళ్లిన నేపథ్యంలో సిట్ అధికారులు ప్రస్తుతం అతనిపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. కేత్లావత్ రాజేశ్వర్ నాయక్, తిరుపతయ్యలకు కాకుండా ఇంకా ఎవరెవరికి ప్రశ్నపత్రాలు ఇచ్చాడు? వాళ్లు ఇంకెవరికైనా అమ్మారా? అమ్మితే ఎంత డబ్బు డాక్యా చేతికొచ్చింది? వచ్చిన డబ్బును ఏం చేశాడు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

అదే సమయంలో ప్రవీణ్‌తో రేణుకకు మూడేళ్ల పరిచయం ఉన్న నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు సైతం డాక్యా చేతికి వచ్చాయా? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలకు సంబంధించి డాక్యా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం. తాను కేవలం ఏఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాలను మాత్రమే కేత్లావత్ నాయక్, తిరుపతయ్యలకు మాత్రమే ఇచ్చినట్టు చెబుతున్నట్టు తెలిసింది.

ఆ ముగ్గురిని ప్రశ్నిస్తే..

రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్‌లతో కలిపి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన షమీమ్, రమేశ్, సురేశ్‌లను ప్రశ్నిస్తే, ప్రిలిమ్స్ పేపర్ లీకేజీకి సంబంధించి కీలక వివరాలు వెల్లడి కావొచ్చని సిట్అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురిని ఆరు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీకి ఇవ్వలేదు.

దీంతో వారిని విచారించాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిట్ అధికారులు మరోసారి పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనున్నది. ఒకవేళ ఆ ముగ్గురిని కోర్టు కస్టడీకి ఇస్తే, ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, డాక్యా, కేత్లావత్ రాజేశ్వర్‌ నాయక్‌ల కస్టడీని పొడిగించాలని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

పేపర్స్ లీక్ కేసులో మరొకరి అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని నేరళ్ల చెరువు గ్రామానికి చెందిన యువకుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పంచాంగల్ తండాకు చెందిన డాక్యానాయక్ (రేణుక భర్త), సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి నేరళ్ల చెరువు గ్రామానికి చెందిన రాజేంద్రకుమార్ గతంలో ఆరేళ్ల పాటు గండీడ్ మండలంలో ఉపాధి హామీ పథకంలో పని చేసినప్పుడు మిత్రులు.

టీఎస్‌పీఎస్సీ పరీక్షకు 3 రోజుల ముందు హైదరాబాద్‌‌లో తనను కలిసిన డాక్యానాయక్‌కు తాను పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లు తిరుపతయ్య చెప్పాడు. ఈ క్రమంలో డాక్యానాయక్ వద్ద తిరుపతయ్య ప్రశ్నపత్రాన్ని తీసుకుని రాజేంద్ర కుమార్‌కు ఇచ్చాడు. ఇందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రాజేంద్ర కుమార్ రూ.5లక్షలను అడ్వాన్స్‌గా తిరుపతయ్యకు ఇచ్చాడు. మిగతావి ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేంద్ర కుమార్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

వారి లిస్ట్ రెడీ

గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వందకు పైగా మార్కులు వచ్చిన కొందరిని సిట్ అధికారులు ఆదివారం ఎంక్వయిరీ చేశారు. అందుబాటులో ఉన్నవారిని సిట్ కార్యాలయానికి పిలిపించి వివరాలు తీసుకున్నారు. దీంట్లో విలువైన సమాచారం ఏదీ దొరకలేదని సమాచారం. ఈ నేపథ్యంలో అవసరమైతే మళ్లీ కాంటాక్ట్ చేస్తామని చెప్పి వారిని పంపించి వేసినట్టు తెలిసింది. వంద కన్నా ఎక్కువ మార్కులు సాధించిన 125 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు, పది, ఇరవై మంది చొప్పున పిలిపించి ప్రశ్నించాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. దీని కోసం వీరికి సైతం నోటీసులు పంపించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed