చండూరు మున్సిపాలిటిలో పేరుకుపోయిన బకాయిలు

by Mahesh |
చండూరు మున్సిపాలిటిలో పేరుకుపోయిన బకాయిలు
X

దిశ, చండూరు: పురపాలికల్లో రోజు రోజు కి పాత బకాయిలు పేరుకుపోయిన అభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయి. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే మున్సిపాలిటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంత మంది సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తున్న మరికొంతమంది మొండికేయటంతో మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకపోయినట్లు తెలుస్తుంది.

మడిగల అద్దె బకాయి 20 లక్షల పైనే

మున్సిపాలిటిలో పలు అభివృద్ధి పనులను చేపట్టడానికి నిధుల సమీకరణలో భాగంగా మున్సిపాలిటీలో 21 మడిగలకు గాను 18 మడిగలను గత సంవత్సరం మార్చి నెలలో వేలంపాట నిర్వహించారు. ఇందులో 13 మడిగలను వేలం పాటలో పోటాపోటీగా వ్యాపారులు దక్కించుకున్నారు. మిగతా 5 మెడిగలకు ఎవ్వరు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం వాటిలో త్రిబులార్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాగా కొన్ని దుకాణాలకు సకాలంలో అద్దెలు వసులవుతున్నా నాలుగు దుకాణాలకు సంబంధించి గత 14 నెలలుగా అద్దెలు చెల్లించక పోవడంతో సుమారు ఇరవై లక్షలకు పైగా అద్దె సొమ్ము బకాయి పడిందని అధికారులు తెలిపారు.

పూర్తిగా వసులుకాని పన్నులు.

మున్సిపాలిటీలో వివిధ రకాల పన్నుల రూపంలో సంవత్సరానికి సుమారు యాభై తొమ్మిది లక్షల వరకు ఆదాయం రావలసి వుంది.కానీ గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 80 శాతం మేరకు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో బకాయి పడ్డ వారికి అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన పన్నులు పూర్తిగా వసులు కాకపోవడం విశేషం. అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎర్లీ బర్డ్ స్కిం వల్ల ఆశించిన స్థాయిలో పన్నులు వసూళ్లు కాలేదని సమాచారం.

పశువుల సంత బకాయిలు అధికం

మున్సిపాలిటీలో ప్రతి శుక్రవారం నిర్వహించే పశువుల సంత నిర్వాహకుడు గత మూడు సంవత్సరాలుగా వేలంపాట సొమ్ము చెల్లించక పోవడంతో సుమారు 42 లక్షల వరకు బకాయి పడినట్లు అధికారులు తెలిపారు.

నోటీసులు బేఖాతర్...

పన్నులు చెల్లించని దుకాణాల యజమానులకు, వ్యాపారస్తులకు సంత నిర్వహకునికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్న బకాయిదారులు మాత్రం నోటీసులకు స్పందించటం లేదు. మున్సిపాలిటీలో నోటీసుల జారీ ఒక నామమాత్రపు ప్రక్రియగా మిగిలి పోతుందని పలువురు అంటున్నారు. దీంతో అధికారులు బకాయిలు చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఖాజా మొయినుద్దీన్. కమిషనర్. చండూరు మున్సిపాలిటీ

మడిగల కిరాయి చెల్లించని దుకాణదారులకు, పశువుల సంత నిర్వహకునికి నోటీసులు జారిచేసాం. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం బకాయిలు వసూలు చేస్తాం. ఉన్నతాధికారుల సూచన మేరకు వారిపై చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed