మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్ధకంః మంత్రి ఉత్తమ్

by Nagam Mallesh |
మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్ధకంః మంత్రి ఉత్తమ్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ః బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. లక్షకోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారి కూలిపోవడం గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అన్నారు. దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ పరిధిలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కుంటలు, చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎంతటి వారైనా చెరువులను కబ్జా చేస్తే వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బునాదిగాని, పిలాయిపల్లి, దర్మారెడ్డి పల్లి కాలువలకు ఎన్ని నిధులైన ఖర్చు చేసి పూర్తి చేస్తాం అన్నారు.

దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి 2026 నాటికి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ కింద 18 వేల కోట్ల విడుదల చేశామన్నారు. వివిధ కారణాలతో 13 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ఇంకా 500 కోట్లు రూపాయల అయిన అందరికి రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు అయోమయానికి గురి కావద్ధన్నారు. నలబై రోజులలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించి అర్హులైన వారందరికీ అందజేస్తామన్నారు. రాబోయే పదిహేను రోజులల్లో తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో 15 వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఇరవై ఐదు రోజులలో 18 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన ఎనిమిది నెలకే తట్టుకోలేక పోతున్నారన్నారు. ధరణి ప్రక్షాళన చేసి ఆర్ఓఆర్ చట్టం దేశానికి రోల్ మోడల్ గా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed