- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేట పేట మార్కెట్‌లో దగా..నిలువునా దోచుకుంటున్న దళారులు
దిశ,సూర్యాపేట టౌన్ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ధాన్యం తీసుకోస్తున్న రైతులు దళారుల చేతులలో చిత్తు అవుతున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని సాకు చూపి, తక్కువ ధరలను కేటాయింపులు చేస్తూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు రోజుకు 20 వేల బస్తాల నుంచి 50 వేల బస్తాల వరకు నూతన ధాన్యం వస్తుంది. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు అత్యధికంగా 56 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చింది. గ్రేడ్ ఏ ధాన్యం మద్దతు ధర ఒక క్వింటాకు రూ. 2,320 లు సాధారణ రకం ధాన్యం కు రూ.2,300 లు ఉండగా, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఒక క్వింటాకు రూ. 1,500 లు నుంచి రూ. 1,900 లు వరకు మాత్రమే ధరలు నిర్ణయిస్తున్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుండటం, చేతికి వచ్చిన పంటను రైతులు మార్కెట్ కు తీసుకు వస్తుండటంతో రైతులను కమిషన్ దారులు, ఖరీదు దారులు కుమ్మకై నిలువునా దోచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకుపోతే మార్కెట్ కు ధాన్యం తక్కువగా వస్తుందని తెలిసి కమిషన్ దారులు, ఖరీదు దారులు ఏకమై రైతులకు తక్కువ ధరలను కేటాయిస్తున్నారు. రైతులకు తక్కువ ధరలు వస్తున్నా మార్కెట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ కి ధాన్యం తీసుకువచ్చి తక్కువ ధరలతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేమ, తాలు సాకు చూపి..
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కి వస్తున్న ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటుందని, తాలుశాతం కూడా ఎక్కువగా ఉంటుందని సాకు చూపి తమ పంటకు తక్కువ ధరలను నిర్ణయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్ వ్యాపారం చేస్తున్న కమీషన్ దారులు (దళారులు) చేతులతో ధాన్యం ను పరిశీలన చేసి ధరలను నిర్ణయిస్తూన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలో ఎలాంటి తాలు, తేమ లేకుండా ఇంటి వద్ద ఆరబెట్టుకుని మార్కెట్ కి తీసుకోని వస్తే, ఆయా సాకులు చూపి తమను నిలుపున మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో మంచి ధరలు వస్తున్నాయని కమీషన్ దారులు ఫోన్లు చేసి పిలుస్తున్నారని తీరా మార్కెట్ కు వస్తే తమను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
పట్టింపులు లేని మార్కెట్ అధికారులు
తేమశాతం పేరుతో రైతులకు తక్కువ ధరలు వస్తున్నా మార్కెట్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీదు దారులు, కమిషన్ దారుల మాటే మార్కెట్ అధికారులు వింటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్క యార్డుకు ఒక సూపర్ వైజర్ ను ఏర్పాటు చేసిన ఏ రోజు కూడా సూపర్ వేజర్ లు యార్డులను పరిశీలించిన దాఖలాలు లేవు. సూర్యాపేట మార్కెట్ కార్యదర్శి గా ఉన్న సంతోష్ కుమార్ కు జిల్లా మార్కెటింగ్ శాఖ ఇన్ చార్జి అధికారిగా బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన మార్కెట్ కు చుట్టపుచూపుగా వచ్చి కలెక్టరేట్ కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కమీషన్ దారులు,ఖరీదు దారులు ఏకమై రైతులను నష్టపరుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేట మార్కెట్ కార్యదర్శికి జిల్లా మార్కెటింగ్ శాఖ ఇన్చార్జి అధికారిగా కొనసాగుతుండటంతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సిబ్బంది నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వారు లేరు.
దీంతో మార్కెట్ సిబ్బంది కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. మాకు మార్కెట్ ఫిజ్ వస్తే చాలు, రైతుల ధాన్యాన్ని తక్కువ ధరలు వస్తే మాకే సంబంధం అన్న చందంగా మార్కెట్ కార్యాలయ సిబ్బంది వ్యవహారిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్ లో రైతులకు తక్కువ ధర వస్తున్న మార్కెట్ కార్యాలయ సిబ్బంది కార్యాలయం నుంచి బయటకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
50 వేల బస్తాల పైగా ధాన్యం రాక..
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఖరీఫ్ సీజన్ ధాన్యం రావడం ప్రారంభమైంది. గత కొద్దిరోజులుగా 15 వేల బస్తాల నుంచి 30 వేల బస్తాలకు పైగా ధాన్యం మార్కెట్ కు వస్తుంది. తాజాగా సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు 50 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చింది. ఈ సీజన్ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు భారీ స్థాయిలో ధాన్యం రావడం ఇదే ప్రథమం. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు భారీగా ధాన్యం రావడంతో ఖరీదు దారులు ధరను అమాంతం ధరలు తగ్గిస్తున్నారు.
మంచి ధర కల్పిస్తున్నాం..: మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్ కుమార్..
వ్యవసాయ మార్కెట్ కి వచ్చే రైతులందరికీ వారు తెచ్చిన ధాన్యాన్ని బట్టి మంచి ధరని కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు యార్డు లలో పర్యవేక్షణ చేస్తున్నాం. అలాగే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు సోమవారం సుమారుగా 56,000 బస్తాల పైగా ధాన్యం రావడంతో నేడు వ్యవసాయ మార్కెట్ కు సెలవు ప్రకటిస్తున్నాం. ధాన్యం కాంటాలు వేయడం వాటిని ఎగుమతులు చేయడం హామాలీ ల కొరత ఉండటం వంటి పలు కారణాల వల్ల మార్కెట్లో ధాన్యం పూర్తిస్థాయిలో ఎగుమతులు చేయలేమని ఖరీదారులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.దీంతో మార్కెట్ కి సెలవు ప్రకటిస్తున్నాం.
అనుకున్న ధర రావడం లేదు..: ఎలమంచి, రైతు,కూసుమంచి
మార్కెట్ కు ఎన్నో ఆశలతో ధాన్యాన్ని తీసుకువచ్చాను తీరా వచ్చాక తేమ శాతం పేరుతో రూ.1800 ఇచ్చారు. ఖరీదు దారుడు ధాన్యమును చేతితో నలిపి ధరను నిర్ణయిస్తున్నాడు. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులకు తెలియజేసిన వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నా ధాన్యానికి ఎక్కువ రేటు ఇప్పించగలరని కోరుతున్నాం.