ఆ అధికారి తీరు.. ఇక్కడా మారలే

by Naveena |
ఆ అధికారి తీరు.. ఇక్కడా  మారలే
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): ఆ అధికారి తీరు ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమే..కింది స్థాయి ఉద్యోగులను మానసికంగా వేధించడం..సమన్వయంతో పని చేయించుకోలేకపోవడం వల్ల వివాదాస్పద ఉద్యోగిగా ముద్రపడ్డాడు. దీంతో ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడి ఉద్యోగులు నిరసనలు తెలపడం, ఉన్నత ఉద్యోగులకు ఫిర్యాదు చేయడం, వారు ఆయన్ని మరో ప్రాంతానికి బదిలీ చేయడం అతనికి పరిపాటిగా మారింది. ఇంతకీ ఆ వివాదాస్పద మండల అధికారి ఎవరంటే..జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి టీ.పవన్ కుమార్. చింతలపాలెం ఎంపీడీవోగా పనిచేస్తున్న పవన్ కుమార్ ను కింది స్థాయి ఉద్యోగులతో సమన్వయ లేమి, అక్కడి ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ గత ఆగస్టు నెలలో జాజిరెడ్డిగూడెం మండలానికి బదిలీ చేశారు. ఈ మూడు నెలల కాలంలో అటెండర్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ వరకు అందరినీ మానసికంగా ఏదో రకంగా వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆరోపించారు. అయినా తీరు మారక పోవడంతో.. గురువారం మధ్యాహ్న భోజన సమయంలో మూకుమ్మడిగా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని వీడియో కాల్ చేయమని కోరడం, మహిళ ఉద్యోగులు వీడియో కాల్ చేయకపోతే వారిని మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. చివరకు మహిళ ఉద్యోగులకు ఆరోగ్య సమస్యల పరంగా కూడా సెలవులు ఇవ్వడని వాపోయారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమం గురించి తెలుసుకున్న జడ్పీ సీఈవో ఆదేశాల మేరకు..డిప్యూటీ సీఈఓ బీ.శిరీష హుటాహుటిన ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులు ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ విలేకరులతో మాట్లాడుతూ..విషయాన్ని జడ్పీ సీఈవోకు అందజేస్తానని, ఆయన నివేదికను కలెక్టర్ కు అందజేస్తారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed