కార్యదర్శుల సమస్య పై అసెంబ్లీలో నిలదీస్తాం.. సంకినేని వెంకటేశ్వరరావు

by Sumithra |
కార్యదర్శుల సమస్య పై అసెంబ్లీలో నిలదీస్తాం.. సంకినేని వెంకటేశ్వరరావు
X

దిశ, తుంగతుర్తి : పంచాయతీ కార్యదర్శుల సమస్యల పై వివిధ రకాలుగా జరిగే ఉద్యమాలలో ఎలుగెత్తుతూ వారికి అండగా నిలబడతామని, అంతే కాకుండా త్వరలో జరిగే శాసనసభ, మండలి సమావేశాలలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గస్థాయి పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ లీగల్ సెల్ కూడా కార్యదర్శుల సమ్మెను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వారి సమస్యల పై రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఈ మేరకు న్యాయబద్ధంగా కార్యదర్శిలను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగాలించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. తెలంగాణలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే మహారాష్ట్రీయులకు అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం ఇవ్వడమేందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ సంపదంతా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేయడం దారుణం అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయరంగ సంక్షోభంతో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, తదితరవి పెరిగిపోతున్న విషయాలు సీఎం కేసీఆర్ కంటికి కనిపించడం లేదా ? అంటూ ప్రశ్నించారు. పారదర్శకత లేని పాలనతో రాష్ట్రమంతా దుర్భిక్షంలోకి వెళ్తోందన్నారు. నేడు రాష్ట్రంలో జూటా మాటలతో ప్రభుత్వం కొనసాగుతోందని దుయ్యబట్టారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో దుర్మార్గ పాలన వల్ల కొట్లాడాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. అంతకుముందు కార్యదర్శులు బోనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ పార్టీల నాయకులు మల్లెపాక సాయిబాబు, కాపా రవి, గాజుల మహేందర్, గుడిపాటి నరసయ్య, దొంగరి గోవర్ధన్, దాసరి శ్రీను, కొండగడుపుల నవీన్, పల్లా సుదర్శన్, బుర్ర శ్రీనివాస్, ఓరుగంటి అత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్టీపీ రాష్ట్ర నేత ఏపూరి సోమన్న ఫోన్ ద్వారా మద్దతు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed