ప్రమాదంలో సాగర్ కాలువ.. కోతకు గురవుతున్న కట్ట

by Mahesh |
ప్రమాదంలో సాగర్ కాలువ.. కోతకు గురవుతున్న కట్ట
X

దిశ, మిర్యాలగూడ: వేములపల్లి మండలం ఎల్ 17 నుంచి ఎల్ 18,19 మధ్యలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట కోత గురవుతుంది. కట్టకు ఆనుకుని ఉన్న చెట్లను నరికి వేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ కట్ట కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో సాగర్ ఎడమ కాలువ కట్ట ఏ సమయంలోనైనా తెగే ప్రమాదం ఉంది. కట్ట తెగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు. కట్ట తెగిన తర్వాత హడావుడి చేసే అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోత గురైన కట్ట

ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ చాలాచోట్ల దెబ్బతింది. వేములపల్లి మండలం 68 కిలోమీటర్ వద్దా, ఎత్తిపోతలు 18, 19 వద్ద కాలువ కట్ట బలహీనంగా మారింది. దీంతో ఎప్పుడు తెగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 2004 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 4444 కోట్ల రూపాయలతో సాగర్ ఎడమకాలువను బలోపేతం చేయడం కోసం నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా ఎడమ కాలవకు సీసీ లైనింగ్‌తో పాటు తూముల మరమ్మతులు చేపట్టారు. పలుచోట్ల ఇప్పటికీ కాలువ కట్ట సీసీ నిర్మాణం జరగకపోవడంతో కోతకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెగితే భారీ ఎత్తున నష్టం

కోతకు గురైన చోట్ల కాలువ కట్ట తెగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నడిగూడెం మండలం లో కాల్వకట్ట తెగడం వలన 4909 ఎకరాలలో పంట మునిగిపోయినట్లు, సుమారు 40000 ఎకరాలలో పంట ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా ఇక్కడ కూడా కాలువ కట్ట తెగితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. వరి పొలాలు పొట్ట దశకు రావడంతో కాలువ కట్ట ప్రమాదానికి గురైతే రైతులు పడిన కష్టమంతా నీటి పాలవుతుందని, పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బంది లేదు కావాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతకు గురైన కాలువను వెంటనే మరమ్మతులు చేపట్టి పంట పొలాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

త్వరలోనే కట్ట బలోపేతానికి పనులు చేపడతాం

రెండు రోజుల్లో టెండర్లను పిలిచి వారం రోజుల లోపు కట్ట బలహీనంగా ఉన్నచోట పనులు చేపడతాం. సాగర్ కాలువ పరిధిలోని బలహీనంగా ఉన్న ప్రతి చోట నూతన కట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని ఈ ఈ లక్ష్మణ్ నాయక్ తెలిపారు.

Next Story

Most Viewed