Nasrallah:100 మంది పిల్లలకు నస్రల్లా పేరు.. ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం

by vinod kumar |
Nasrallah:100 మంది పిల్లలకు నస్రల్లా పేరు.. ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమాణిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మృతికి నివాళిగా ఇరాక్‌లోని100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టినట్టు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జన్మించిన 100 మంది పిల్లల జననాలను నస్రల్లా పేరుతో నమోదు చేశారు. అమరవీరుల గౌరవార్థం ఈ చర్య తీసుకున్నట్లు ఇరాక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నస్రల్లా మరణానంతరం ఆయన పేరు కొత్త తరం ప్రజలకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, గత నెల 27న ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో చేసిన దాడుల్లో నస్రల్లా ప్రాణాలు కోల్పోయారు. నస్రల్లా మూడు దశాబ్దాలకు పైగా హిజ్బుల్లా చీఫ్‌గా కొనసాగారు. ఇరాక్‌తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరాక్ ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుదానీ నస్రల్లాను అమరవీరుడిగా అభివర్ణించారు. ఆయన మరణానంతరం దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టడం గమనార్హం.

Advertisement

Next Story