రూ.10 కోట్ల స్కామ్.. ఇంటి దొంగల పనేనా..?

by Mahesh |
రూ.10 కోట్ల స్కామ్.. ఇంటి దొంగల పనేనా..?
X

‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడనే’ సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు కార్మిక శాఖ ఉద్యోగులు. ఒక్కటీ కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్ల స్కామ్ జరిగి ఆర్నెళ్లు దాటింది. అయినా నేటికీ విచారణలో అతీగతీ లేదు. సొమ్ము రికవరీ చేసింది లేదు. ఇంటి దొంగల పని పట్టింది లేదు. బోగస్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను అంతమొందించేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడమూ కొసమెరుపు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు కానీ.. కార్మిక శాఖ అధికారులు కానీ స్పందించడం లేదు. దీంతో అసలైన బాధితులకు న్యాయం జరగడం లేదు. కార్మిక శాఖ కార్యాలయంలో అడుగు పెడితే.. దురుసు సమాధానం.. చీదరింపులు.. చీత్కారాలే ఎదురవుతుండడం గమనార్హం. లేబర్ ఇన్సూరెన్స్ స్కామ్ విషయంలో ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని విచారణ చేస్తుందా..? లేదా వదిలేస్తుందా..? అన్నది వేచిచూడాల్సిందే.

దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కార్మిక శాఖలో ఇటీవల బోగస్ ఇన్సూరెన్స్ కార్డుల బాగోతం పెద్దఎత్తున వెలుగు చూసింది. వాస్తవానికి కార్మికులు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకోకపోయినా.. చనిపోయిన తర్వాత సృష్టించి రూ.కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించి ఆడియో రికార్డులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ వ్యవహారంపై లేబర్ శాఖ అధికారులు కానీ.. జిల్లా ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదు. నిజానికి నల్లగొండ కార్మిక శాఖలో పనిచేస్తున్న ఓ ఇద్దరు సిబ్బంది.. ఏజెంట్ల ద్వారా ఈ కుంభకోణం తతంగాన్ని నడిపినట్టు సమాచారం.

దాదాపు ఈ వ్యవహారం వెలుగు చూసి మూడు నెలలు దాటినా.. నేటికీ కనీసం చట్టపరమైన విచారణకు నోచుకోలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్మిక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఇద్దరు సిబ్బంది, ఏజెంట్ల ద్వారా ఫేక్ ఇన్సూరెన్స్ కార్డులు సృష్టించి రూ.లక్షలు పక్కదారి పట్టించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రూ.6 లక్షలకు బదులు రూ.30వేలే ఇచ్చిర్రు..

నల్లగొండ రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన తాపీ పని చేసే ఓ వ్యక్తి మూడు నెలల కింద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే సదరు వ్యక్తికి నిజానికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోలేదు. కానీ కార్మిక శాఖ అధికారులకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా అప్పటికప్పుడు కొత్తగా లేబర్ కార్డు తీసుకుని ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకున్నారు. దీంతో సదరు కుటుంబానికి రూ.1.30లక్షలు నగదు బ్యాంకు ఖాతాలో పడింది. అయితే సదరు ఏజెంట్ మృతుడి కుటుంబానికి కేవలం రూ.30 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా సొమ్మును రూ.లక్షను అధికారులు, ఏజెంట్లు స్వాహా చేసేశారు.

నిజానికి ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు కార్మిక శాఖ ఇన్సూరెన్స్ ఉంటే రూ.6లక్షలు ఇవ్వాల్సి ఉండడం కొసమెరుపు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి సైతం చనిపోగా, అతని లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా రూ.1.30 లక్షలకు క్లైయిమ్ చేసుకుని, ఏజెంట్లు, అధికారులు కలిసి కేవలం ఆ కుటుంబానికి సైతం రూ.30 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే సదరు మొత్తం మృతుడి భార్య అకౌంట్‌లో కాకుండా అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరుపై ఉన్న అకౌంట్‌లో జమ చేయడం కొసమెరుపు.

గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్లు..

ఇటీవల నల్లగొండ ప్రాంతంలో సెటిల్‌మెంట్ బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఇక్కడ ఎటువంటి ఇష్యూ తలెత్తినా.. ఏదైనా లొసుగు తెలిసినా.. అందులో ఇన్వాల్వ్ కావడం వీరికి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. దాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్షలు దండుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే కార్మిక శాఖలో వెలుగుచూసిన బోగస్ ఇన్సూరెన్స్ స్కామ్‌లోనూ జోక్యం చేసుకుని రూ.3లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

సెటిల్‌మెంట్ బ్యాచ్ ఆగడాల వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. లేబర్ ఇన్సూరెన్స్ స్కామ్ విషయంలో ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని విచారణ చేస్తుందా..? లేక షరా మామూలుగానే వదిలేస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed