'సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలి'

by Sumithra |
సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలి
X

దిశ, పెద్దవూర : రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని జిల్లా సహకార అడిట్ అధికారి, డిప్యూటీ రిజిస్టర్ గోలి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతులకు ప్రత్యేక మహాజన సభ సమావేశంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి రైతు భరోసాకు సంబంధించి సూచనలు, అభిప్రాయ సేకరణను లిఖిత పూర్వకంగా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమకు రుణమాఫీ కావడం లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు రుణాల కోసం వెళితే పాతవి కట్టే వరకు కొత్తవి ఇచ్చేది లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, రుణం తీసుకున్న ప్రతీ ఒక్కరు చెల్లిస్తేనే మిగితా రైతులుకు ఇస్తామని అంటున్నట్లు చెపుతున్నారని అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, గ్రామాల్లో వెంచర్లు చేసిన వాటికి, ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేసి (ఖాళీగా) ఉన్న భూములకు రైతు భరోసా సాయం అందివ్వద్దని సూచించారు. రైతు భరోసా డబ్బులు సైతం జూలై మొదటి వారంలో వేయాలని కోరారు.

మెజార్టీ రైతులు మాత్రం 10 ఎకరాలలోపు వరకు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని తెలిపారు. అందులో కూడా సాగు ఎంత చేస్తే అన్ని ఎకరాలకు మాత్రమే అందించాలని సూచించారు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చలామణి అవుతున్నవారికి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు, ఫాంహౌజ్‌లు కట్టుకున్న వారికి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు ఇవ్వరాదని తెలిపారు. కైలు రైతులకు రైతూ భరోసా సాయం అందేలా చూడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుముల ఫీల్డ్ సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ తరుణ్, మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్, పెద్దవూర మండల క్లస్టర్స్ ఏ ఈ ఓ లు , సంఘ కార్యదర్శి వద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, సంఘం పాలకవర్గ సభ్యులు, సంఘ సిబ్బంది రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story