ఆదాయం ఉన్నా ఏం లాభం.. హాలియా మార్కెట్ యార్డ్ పరిస్థితి ఇదీ

by Y.Nagarani |
ఆదాయం ఉన్నా ఏం లాభం.. హాలియా మార్కెట్ యార్డ్ పరిస్థితి ఇదీ
X

దిశ, హాలియా: నాడు మార్కెట్ యార్డులో వందలాదిమంది హమాలీ కార్మికులు దడువాయిలు ట్రేడర్లు రైతులతో కళకళలాడిన హాలియా మార్కెట్ యార్డు నేడు కళావిహీనంగా మారింది. ఏటా ఆదాయం ఉన్నా.. అభివృద్ధికి మాత్రం నోచుకోలేక పోతుంది. పాలకవర్గాలు మారినా మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు నోరు విప్పడం లేదు. జిల్లాలోనే బహిరంగ మార్కెట్ యార్డ్ గా ప్రసిద్ధిగాంచిన హాలియా మార్కెట్లో నేడు క్రయవిక్రయాలు లేక మార్కెట్ యార్డు స్థలం బోసిపోతుంది. నియోజకవర్గ కేంద్రమైన హాలియా మార్కెట్ యార్డు అభివృద్ధి చేయడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభించడం కారణంగా కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన షెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఒకప్పుడు వెలిగిన మార్కెట్ యార్దు

నిడమనూరు మార్కెట్ యార్డు నుంచి 1993లో హాలియా మార్కెట్ యార్డు ఏర్పడిన తర్వాత మార్కెట్ యార్డు అభివృద్ధిపై గత ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు జరిగాయి. 1993 నుంచి సుమారు 15 ఏళ్ల పాటు హాలియా మార్కెట్ యార్డులో పత్తి, అపరాలు, ధాన్యం తదితర కొనుగోలుతో కళకళలాడింది. ఆ సమయంలోనే మార్కెట్ యార్డులో నూతన గోడౌన్ ల నిర్మాణంతోపాటు తదుపరి అత్యున్నత స్థాయి గోడౌన్ లు నిర్మించారు. ప్రధానంగా దీపావళి సీజన్ నుంచి సంక్రాంతి సీజన్ వరకు సుమారు నాలుగు నెలల పాటు పత్తి అపరాల కొనుగోళ్ళతో మార్కెట్ యార్డు కళకళలాడిన సందర్భాలు ఉన్నాయి. 2010 అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యేకతలు తగ్గుతూ రావడంతో ఆరేళ్లుగా మార్కెట్ యార్డ్ ఎటువంటి కొనుగోళ్ళు లేకుండా కళతప్పింది.

నిర్వీర్యమైన ట్రేడర్ వ్యవస్థ

హాలియా మార్కెట్ యార్డులో 1993 నుంచి 2015 వరకు మార్కెట్ యార్డులో సుమారు 50 మంది లైసెన్స్ ట్రేడర్లు క్రయవిక్రయాలు జరిపారు. ట్రేడర్లు ముందుకు వచ్చినప్పటికీ మార్కెట్లో కమీషన్ వ్యవస్థ లేకపోవడంతో మార్కెట్ యార్డు ఈ స్థితికి చేరుకోవడానికి కారణమైందని వ్యాపార సంఘాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం హాలియా మార్కెట్ యార్డులో మిల్లర్లు మినహా ఒక ట్రేడర్ కూడా లేకపోవడం గమనార్హం.

2010లోనే సీసీఐ కొనుగోలు కేంద్రానికి ప్రతిపాదనలు

హాలియా మార్కెట్ యార్డు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గత 2010లోని అప్పటి పాలకవర్గాలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ఏర్పాటు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతేకాకుండా మార్కెట్ యార్డులో కమీషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో అప్పటి పాలకవర్గాలు విఫలమయ్యాయని వ్యాపారులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2014 కి ముందు జిల్లాస్థాయిలోని అత్యధిక పత్తి కొనుగోలు జరిగిన విషయం విధితమే. తదనంతరం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారు ఐదేళ్లపాటు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను మార్కెట్ యార్డ్ వైపు మళ్ళించారు. తదనంతరం మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

గత సంవత్సరం మార్కెట్ ఆదాయం రూ.4 కోట్ల పైనే

హాలియా మార్కెట్ యార్డు భవిష్యత్తు యార్డు పరిధిలో ఉన్న మార్కెట్ చెక్ పోస్టుల పైనే ఆధారపడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పత్తిపై వినియోగదారులు రుసుము చెల్లింపు ద్వారా ఆయా చెక్ పోస్టుల ద్వారా గత సంవత్సర ఆదాయం రూ.4కోట్లు దాటింది. 8 ఏళ్లుగా మార్కెట్ చెక్ పోస్టుల ద్వారానే యార్డు భవితవ్యం ఆధారపడింది. హాలియా మార్కెట్ యార్డు పరిధిలో అనుముల పెద్దవూర తిరుమలగిరి (సాగర్) మండలాల్లో సుమారు 40వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 1.50 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నప్పటికీ మార్కెట్ యార్డ్ లో క్రయవిక్రయాలు జరగకపోవడంతో గ్రామాల్లో దళారులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కాగా హాలియా మార్కెట్ యార్డుకు గత సంవత్సర ఆదాయంలో కేవలం 17.350 క్వింటాళ్లకు మాత్రమే మార్కెట్ సేస్సు చెల్లించారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే మార్కెట్ చెక్ పోస్టుల్లో ఎంత అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. తద్వారా మార్కెట్ యార్డు కోట్ల రూపాయల్లో నష్టపోవాల్సి వస్తుంది.

మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై నూతన పాలకవర్గం దృష్టి సారించేనా...?

కొద్దిరోజుల్లో హాలియా మార్కెట్ యార్డ్ పాలకవర్గం కొలువుదీరే అవకాశం ఉంది. జిల్లాలోనే బహిరంగ మార్కెట్ గా పేరుగాంచిన హాలియా మార్కెట్ యార్డులో తిరిగి క్రయవిక్రయాలు జరిపేందుకు నూతన పాలకవర్గం దృష్టి సారించేనా..? అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా మార్కెట్ యార్డులో కమీషన్ వ్యవస్థను తీసుకువచ్చి లీడర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానిక రైతులు దళారుల వద్ద పత్తిని అమ్ముకోకుండా నిలువరించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు అడ్డుపడుతున్నా నూతన పాలకవర్గం రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్ యార్డు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలు సిబ్బంది ఏర్పాట్లు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్ యార్డ్ చెక్ పోస్టుల నిర్వహణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే జరగడంతో ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed